MEA Summons to Bangla: ఈశాన్య రాష్ట్రాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:47 PM
బంగ్లాదేశ్ నాయకుడు హస్నాత్ అబ్దుల్లా భారత ఈశాన్య రాష్ట్రాలపై ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై చర్యలు తీసుకుంది భారత్. ఈ మేరకు ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు హస్నాత్ అబ్దుల్లా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాను అస్థిరపరిస్తే.. సెవన్ సిస్టర్స్(7 ఈశాన్య రాష్ట్రాలు)ను ముక్కలు చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు హస్నాత్ అబ్దుల్లా. ఈ విషయమై ఆ దేశ హైకమిషనర్ మహ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది ఇండియా. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితులు క్షీణించడంపై హమీదుల్లా ముందు ఆందోళన వ్యక్తం చేసింది భారత విదేశాంగ శాఖ. ఢాకాలోని ఇండియన్ ఎంబస్సీపై బంగ్లాదేశీయులు బెదిరింపులకు పాల్పడటాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. బంగ్లాలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి ఇండియాపై తప్పుడు కథనాలను పూర్తిగా తిరిస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ ఘటనలకు సంబంధించి తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం లేదా సరైన ఆధారాలను పంచుకోకపోవడం దురదృష్టకరమని భావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
భారత్.. బంగ్లాదేశ్‌తో సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఆ దేశంతో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని.. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చినట్టు గుర్తు చేసింది. తాత్కాలిక ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలకనుగుణంగా బంగ్లాలోని భారత మిషన్లు, పోస్టుల భద్రతను నిర్ధారించాలని ఆశిస్తున్నట్టు స్పష్టం చేసింది ఇండియా. కాగా.. గతేడాది విద్యార్థుల ఆందోళన తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేశారు. నాటి నుంచి భారత్- బంగ్లా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది భారత్.
ఇవీ చదవండి: