డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి ‘భార్గవాస్త్రం’
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:11 AM
దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ చేరనుంది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రం’ను భారత్ విజయంతంగా పరీక్షించింది.

మైక్రో మిస్సైల్ సిస్టమ్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ, జనవరి 15: దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ చేరనుంది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రం’ను భారత్ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్ తరహా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా రూపొందించిన ఈ మైక్రో మిస్సైల్ సిస్టమ్‌ను.. ఒడిసాలోని గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించారు. భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన ఈ మైక్రో మిస్సైల్ 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
ఈ ఏడాది చివర్లో మరోసారి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి దీన్ని సైన్యానికి అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భార్గవాస్త్రం అనేది ఒక కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్ దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు దీన్ని అభివృద్ధి చేశారు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న వైమానిక వాహనాలను కూడా ఇది గుర్తించి, గైడెడ్ మైక్రో బాంబులను ఉపయోగించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. భార్గవాస్త్రం వ్యవస్థకు ఏకకాలంలో 64 మైక్రో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఎక్కడికైనా సులువుగా, వేగంగా తరలించవచ్చు.