Share News

Brigadier P Ganesh: కీలక లక్ష్యాలు సాధించే వరకూ యుద్ధం ఆపకూడదు

ABN , Publish Date - May 11 , 2025 | 03:55 AM

భారత్-పాక్ యుద్ధంలో కీలకమైన టాక్టిక్స్ గురించి బ్రిగేడియర్ పి. గణేశం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాక్ అణ్వస్త్ర బెదిరింపులపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Brigadier P Ganesh: కీలక లక్ష్యాలు సాధించే వరకూ యుద్ధం ఆపకూడదు

  • పాక్‌కు విలువైన వాటిని దెబ్బతీయాలి

  • అప్పుడే ఆ దేశం దారికి వస్తుంది

  • పాక్‌ అణు బెదిరింపులు వట్టివే

  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బ్రిగేడియర్‌ గణేశం

బ్రిగేడియర్‌ పి.గణేశం. భారత ఆర్మీలో 35 సంవత్సరాలకు పైగా పనిచేశారు. సైన్యం చేపట్టిన అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా జరుగుతున్న సమయంలో అక్కడి ఒక బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. తెలంగాణలోని భూంపల్లి గ్రామంలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదివిన గణేశం ట్యాంకులు, ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వెహికిల్స్‌ వంటి ఆర్మర్డ్‌ వెహికిల్స్‌ సాంకేతికతలో నైపుణ్యం గలవారు. రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన టీ-55 యుద్ధ ట్యాంకు ఆధునికీకరణకు చేపట్టిన ‘ప్రాజెక్టు గుల్‌మొహర్‌’లో కీలక పాత్ర నిర్వహించారు. ఆర్మీ కోసం విండీ అనే ఒక మల్టీరోల్‌ ఆయుధ ప్లాట్‌ఫాం రూపకల్పనలోనూ ముఖ్య భూమిక వహించారు. ఆకాశ్‌ క్షిపణుల్ని తయారు చేసే భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లోనూ ఆయన డైరెక్టర్‌గా సేవలు అందించారు. 2005లో రాష్ట్రపతి నుంచి విశిష్ట సేవా మెడల్‌ అందుకున్నారు. ప్రస్తుతం భారత్‌-పాక్‌ మధ్య జరుగుతున్న పోరాటంపై ఆంధ్రజ్యోతికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలివీ...

భారత్‌-పాక్‌లు మొన్నటి వరకూ సరిహద్దు దాటకుండా ఎవరి భూభాగం నుంచి వారు దాడులు చేసుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా పాక్‌ యుద్ధ విమానాలు మన గగనతలంలోకి వచ్చాయి. తాజాగా కాల్పుల విరమణ, ఉల్లంఘనలను ఎలా చూస్తారు?

ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే.. పాకిస్థాన్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. నా ఉద్దేశంలో కొన్ని కీలక పరిణామాలు జరిగితే తప్ప యుద్ధం ఆపకూడదు. యుద్ధాన్ని ఆపాలంటే ఇరు దేశాల మధ్య నిర్దిష్టమైన చర్చలు జరగాలి. పాకిస్థాన్‌ గట్టిగా దెబ్బతింటే తప్ప భారత్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధపడదు. చర్చల్లో పైచేయి సాధించాలంటే మనం బేరమాడే శక్తిని పెంచుకోవాలి.


అంటే భారత్‌ ఏం చేయాల్సి ఉంటుంది?

పాకిస్థాన్‌ విలువైనవిగా భావించే కొన్నింటిని.. భూభాగం లేదా ఇతర అసెట్స్‌ను మనం స్వాధీనం చేసుకోవాలి. అది లాహోర్‌ కావచ్చు. ఆక్రమిత కశ్మీర్‌ కావచ్చు. వారి సైనికుల్ని, పైలట్లను పట్టుకోవడం కావచ్చు. అప్పుడే మనకు బేరమాడే శక్తి పెరుగుతుంది. మనం కోరింది చేయడానికి పాక్‌ అంగీకరిస్తుంది.

ఆ పరిస్థితే వస్తే అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని పాక్‌ బెదిరిస్తోంది కదా?

భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే పాకిస్థాన్‌కు కలిగే లాభం ఏమిటి? తాము సర్వనాశనం అయిపోయి ఏదోలా కసి తీర్చుకోవాలనే దుస్థితి ఏర్పడితే తప్ప పాక్‌ మనపై అణ్వస్త్ర ప్రయోగానికి ఎందుకు సిద్ధపడుతుంది? అలాంటి సందర్భంలో మనం మాత్రం అణ్వస్త్ర ప్రయోగం చేయలేమా? పాక్‌కు ఆ సంగతి తెలియదా? అందువల్ల ఇవన్నీ వట్టి మాటలే తప్ప నిజంగా జరిగే అవకాశం తక్కువ. ఏ దేశస్థులైనా అణ్వస్త్రాల గురించి అతిగా మాట్లాడడం సరికాదు. అయితే ప్రజలను, సైన్యాన్ని ఉత్సాహపరిచే ఉద్దేశంతో కొందరు ఇలాంటి తొడగొట్టే మాటలు మాట్లాడుతుంటారు. స్వీయ స్థైర్యం పెంచుకునే మానసిక యుద్ధంలో ఇవన్నీ భాగం. అంతే!

మీరు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లో పని చేశారు. బీడీఎల్‌ తయారు చేసే ఆకాశ్‌ క్షిపణులు ప్రస్తుత యుద్ధంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. మీ స్పందన ఏమిటి?

ఆకాశ్‌ క్షిపణులు చాలా శక్తిమంతమైనవి. 25 కిలోమీటర్ల రేంజ్‌ కలిగినవి. మన కీలక స్థావరాలను కాపాడే సత్తా వీటికి ఉంది. ఈ క్షిపణుల్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి

Updated Date - May 11 , 2025 | 03:55 AM