India Pakistan Ceasefire: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం..సరిహద్దుల్లో శాంతి శంఖారావం
ABN , Publish Date - May 10 , 2025 | 06:26 PM
శాంతి ఎప్పుడూ యుద్ధం కన్నా గొప్పదే...కానీ కొన్నిసార్లు శాంతి సాధించడానికి కూడా ధైర్యం, సంకల్పం కావాలి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం, భారత్, పాక్ మధ్య తారస్థాయికి చేరిన పరిస్థితులకు తాత్కాలికంగా ముగింపు లభించింది.
శనివారం సాయంత్రం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారత సైన్యం సమాధానం కారణంగా పాకిస్తాన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. చివరకు అమెరికాను రాయబారం కోసం వేడుకోగా, ట్రంప్ చర్చలతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈరోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారత DGMOకి ఫోన్ చేశారు.
భారత ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం 17.00 గంటల నుంచి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని ఈరోజు రెండు పార్టీలకు ఆదేశాలు అందాయన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ చర్చించనున్నట్లు వెల్లడించారు.
దృఢంగా ఉన్న భారత్
కాల్పుల విరమణను ధృవీకరిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశం, పాకిస్తాన్ ఈరోజు కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నిరంతరం దృఢమైన, అచంచలమైన వైఖరిని ఇలాగే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ధైర్యమైన నిర్ణయం
పాకిస్తాన్ దాడుల విషయంలో కేవలం ప్రతిసారీ మౌనంతో సాధ్యపడదని భారత్ ఇటీవల దాడులతో నిరూపించింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. భారత్, తన శక్తిని మౌనంగా చూపించకుండా, స్పష్టంగా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ దురుద్దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ప్రతిస్పందనతో పాక్ చివరికి వెనక్కి తగ్గింది. అమెరికా మధ్యవర్తిత్వంతో, కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించింది.
చివరకు శాంతికే..
ఈ నేపథ్యంలో శనివారం (మే 10న) సాయంత్రం ఈ పరిస్థితులకు ముగింపు లభించింది. అయితే శాంతి అంటే బలహీనత మాత్రమే కాదు. అది సమర్థత, స్థిరత్వం, దేశ ప్రజల పట్ల నిబద్ధత గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పవచ్చు. ఈ పరిణామం శాంతిని నిలుపుకోవడంతోపాటు సైనిక శక్తి ఎలా ఉపయోగిస్తుందో భారత్ మరోసారి పాకిస్తాన్ సహా అనేక దేశాలకు చూపించింది. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రజల ప్రాణాల గురించి ఆలోచించిన భారత్ చివరకు శాంతి విధానానికి సమ్మతించింది.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: ఇండియాతో ఉద్రిక్తత..దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300
India Pakistan Tensions: పాకిస్తాన్ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి