Debate Over National Sentiment: రక్తం క్రికెట్ కలిసి ఆడతాయా
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:21 AM
దుబాయ్‌లో జరుగుతున్న ‘ఆసియా కప్’లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి....
రక్తం-నీరు కలిసి ప్రవహించవన్నారే!.. పహల్గాం రక్త ధారలు మరిచారా?
మహిళల సిందూరం చెరిపిన దేశంతో క్రికెట్టా... ఇది దేశభక్తా.. వ్యాపారమా?
ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఆప్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: దుబాయ్‌లో జరుగుతున్న ‘ఆసియా కప్’లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ... భారత్‌పై ఎగదోస్తున్న పాక్‌తో క్రికెట్ ఆడడమేంటని నాయకులు నిలదీస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తున్నారు. ‘‘నాటి దాడిలో ఎంతో మంది మహిళల సిందూరాన్ని చెరిపేసిన పాక్‌తో ఇప్పుడు క్రికెట్ అవసరమా’’ అని అనేక మంది నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)ల నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘‘నీరు-రక్తం కలిసి ప్రవహించవని.. సిందూ జలాల విషయంపై మీరే ఉద్ఘాటించారు. కానీ, ఇప్పుడు రక్తం-క్రికెట్ కలిసి ఆడుతాయా?. ఇదెలా?.’’ అని శివసేన(యూబీటీ) అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీని నిలదీశారు. ‘‘యుద్ధం-క్రికెట్.. ఒకే సమయంలో ఎలా జరుగుతాయి?. దేశ భక్తికి తోసిరాజని మీరు వ్యాపారం చేస్తున్నారు.’’ అని నిప్పులు చెరిగారు. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు కూడా భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌ను తప్పుబట్టాయి. ఉగ్రదాడిలో తన భర్త శుభం ద్వివేదీని కోల్పోయిన ఐషన్య ద్వివేదీ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా తప్పు. బీసీసీఐ మనసులేకుండా, కనీస మానవత్వం చూపకుండా వ్యవహరిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.
ఉద్ధవ్‌కు నైతిక హక్కులేదు: శివసేన
శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై.. శివసేన(శిండే) నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయని, ఆ సమయంలో కూడా ఇరు జట్ల మధ్య క్రికెట్ సమరం జరిగిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌కు తాజా మ్యాచ్‌పై విమర్శలు చేసే నైతిక హక్కులేదని విమర్శించారు. అధికారం కోసం హిందూత్వను వదిలేసిన ఉద్ధవ్.. ఒకానొక దశలో పాక్‌పై ప్రశంసలు గుప్పించారని గుర్తు చేశారు.
మనం వచ్చేస్తే..
పాక్‌కు లబ్ధి: కేంద్రం
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ వివాదంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ‘‘అందరూ అర్థం చేసుకోవాలి. ఆసియా కప్‌లో మనం ఆడితీరాలి. ఒక వేళ మనం తప్పుకొంటే.. పాకిస్థాన్ మ్యాచ్ పాయింట్లను సొంతం చేసుకుంటుంది. ఏసీసీ, ఐసీసీలు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు మనం పాల్గొనక తప్పదు. దేశాల పరంగా చూసినా ఇది అవసరం. పైగా.. మనం పాక్‌తో ద్వైపాక్షిక మ్యాచ్ ఆడడం లేదు.’’ అని అన్నారు. అంతేకాదు, ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఉపసంహరించే వరకు వారితో ద్వైపాక్షిక మ్యాచ్ ఆడకూడదన్నది భారత విధానమని తెలిపారు. మరోవైపు, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా.. ఈ మ్యాచ్‌ను సమర్థించారు.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News