India: పాక్ ఎంబసీకి వార్తాపత్రికలు నిలిపివేత
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:47 PM
దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించేలా పాక్ చర్యలు ఉన్నాయని పలువురు దౌత్య నిపుణులు చెబుతున్నారు. ఆతిథ్య దేశాలు తమ దేశాల్లోని విదేశీ రాయబార కార్యాలయాలు, సిబ్బంది, వారి కుటుంబాల భద్రతకు కట్టుబడి ఉండాలని వియన్నా ఒప్పందం నిర్దేశిస్తోంది.
న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దాయాది దేశం చర్చకు ప్రతిగా భారత్ మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు వార్తాపత్రికల సరఫరాను నిలిపివేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు కనీస సౌకర్యాలను పాక్ నిలిపివేసిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు.
కనీస అవసరాలే లక్ష్యంగా..
పాక్ ప్రతీకార చర్యలకు దిగుతున్నందున ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్యలతో భారత హైకమిషన్‌కు పైపుల ద్వారా జరిగే గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగిందని, దీంతో దౌత్యవేత్తలు స్థానిక మార్కెట్లలో హెచ్చ ధరలకు గ్యాస్ సిలెండర్లు కొనుగోలు చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సరఫరాకు కూడా గండిపడింది. దీంతో రోజువారీ అవసరాలకు కూడా ఇబ్బంది నెలకొంది. భారత అధికారుల నివాసాలకు స్థానిక వార్తాపత్రికల సరఫరా నిలిపేశారు. భారత దౌత్యవేత్తలను వేధించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇస్లామాబాద్ ఈ చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
వియనా ఒప్పందం ఉల్లంఘన
దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించేలా పాక్ చర్యలు ఉన్నాయని పలువురు దౌత్య నిపుణులు చెబుతున్నారు. ఆతిథ్య దేశాలు తమ దేశాల్లోని విదేశీ రాయబార కార్యాలయాలు, సిబ్బంది, వారి కుటుంబాల భద్రతకు కట్టుబడి ఉండాలని వియన్నా ఒప్పందం నిర్దేశిస్తోంది. కాగా, పాక్ చర్యకు ప్రతిగానే న్యూఢిల్లీలోని పాక్ ఎంబసీకి వార్తాపత్రికలను భారత్ నిలిపివేసిందని చెబుతున్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) కానీ, పాక్ విదేశాంగ కార్యాలయం కానీ ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇవి కూడా చదవండి..,
పౌరసత్వానికి ఆధార్‌ను పరిగణనలో తీసుకోలేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
సెల్ఫీ ముచ్చట..మరోసారి సహనం కోల్పోయిన జయాబచ్చన్
For More National News and Telugu News