Birth Rates Decline: వయో వృద్ధ భారతం
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:41 AM
మన దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఒకరు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. నమూనా నమోదు సిస్టం..
దేశంలో తగ్గుతున్న జననాలు.. పెరుగుతున్న వృద్ధుల జనాభా
జనాభాలో 10 శాతం వయోధికులే
జనాభా సంక్షోభంతో నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: మన దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఒకరు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. నమూనా నమోదు సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్)- 2023 నివేదిక ఇటీవల ఆ గణాంకాలను వెల్లడించింది. పడిపోతున్న జననాల రేటు, పెరుగుతున్న ఆయుర్దాయంతో వయో వృద్ధ భారతంగా దేశం మారుతోందని నిపుణులు చెబుతున్నారు. వయోధికుల ఆరోగ్య సంరక్షణ, పింఛన్లు, సామాజిక భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ప్రకారం దేశ జనాభాలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు 9.7 శాతంగా ఉన్నారు. 2011లో అది 8.6గా మాత్రమే ఉంది. 65 ఏళ్లు పైబడ్డ వారిలో పెరుగుదల 6.4 శాతంగా నమోదైంది. 60 ఏళ్లు పైబడిన వయోధికుల జనాభాలో కేరళ 15 శాతంతో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉంది. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, హిమాచల్, పంజాబ్, మహారాష్ట్ర వృద్ధుల జనాభా జాతీయ సగటు 9.7% కంటే ఎక్కువ ఉంది. ఇక బిహార్, మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో వయోధికుల జనాభా 8ు లోపే ఉంది. అంటే ఈ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి బాగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల్లో జనాభా తగ్గుముఖం పట్టింది.
పెరుగుదలకు కారణాలు, సవాళ్లు
వృద్ధుల జనాభా పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మొత్తం పునరుత్పత్తి రేటు (టీఎ్‌ఫఆర్) జనాభా భర్తీ స్థాయి 2.1 కంటే తగ్గిపోవడం, రెండు.. ఆయర్దాయం పురుషులకు 68.5 ఏళ్లకు, మహిళలకు 72.5 ఏళ్లకు పెరగడం. టీఎ్‌ఫఆర్ తగ్గడం వల్ల జనాభాలో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఆయుర్దాయం పెరగడం వల్ల వృద్ధుల జనాభా పెరుగుతూపోతోంది.
దేశంలో తక్కువ మంది ప్రజలు మాత్రమే శ్రామిక శక్తిగా ఉంటారు. యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయి. వృద్ధ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో శ్రామిక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. వృద్ధులు ఒంటరిగా మిగిలిపోయి ప్రభుత్వంపైనో, సేవా సంస్థలపైనో ఆధారపడాల్సి వస్తోంది.
భవిష్యత్ కోసం చర్యలు తీసుకోవాలి
ఇప్పటికీ దేశంలో యువ జనాభా ఎక్కువగానే ఉన్నా.. వృద్ధ జనాభాలో పెరుగుదల, పిల్లల జనాభా తగ్గుదల ఓ హెచ్చరికగా నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వృద్ధుల జనాభా అధికంగా ఉన్న చైనా, జపాన్, యూరప్ దేశాల సరసన భారత్ కూడా చేరడానికి ఎంతో సమయం పట్టదంటున్నారు. వృద్ధులకు సదుపాయాలు కల్పిస్తూనే, యువ జనాభా పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
For More National News and Telugu News