Share News

Human Library: ఆ గ్రంథాలయంలో మనుషులే పుస్తకాలు

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:54 AM

అనుభవజ్ఞుడైన వ్యక్తితో కొద్ది సమయం గడిపినా బోలెడన్ని పుస్తకాలు చదివినంత జ్ఞానం లభిస్తుందని పెద్దలు

Human Library: ఆ గ్రంథాలయంలో మనుషులే పుస్తకాలు

  • ఐఐటీ పాలక్కడ్‌ క్యాంప్‌సలో ప్రయోగం

పాలక్కడ్‌, ఆగస్టు 3: అనుభవజ్ఞుడైన వ్యక్తితో కొద్ది సమయం గడిపినా బోలెడన్ని పుస్తకాలు చదివినంత జ్ఞానం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇదే తరహాలో భిన్నంగా ఆలోచించిన కేరళలోని ఐఐటీ పాలక్కడ్‌ ప్రొఫెసర్లు తమ క్యాంప్‌సలో పుస్తకాలు లేని హ్యూమన్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ మనుషులే పుస్తకాల్లా వ్యవహరిస్తారు. తమ అనుభవాలను సందర్శకులకు వివరిస్తారు. దీనికి సంబంధించి డెన్మార్క్‌కు చెందిన ఓ సంస్థతో ఐఐటీ పాలక్కడ్‌ ఒప్పందం కురుర్చుకుంది. చాలా ఏళ్ల క్రితమే డెన్మార్క్‌లో హ్యూమన్‌ లైబ్రరీ ఉద్యమం కొనసాగడంతో అక్కడి సంస్థతో అవగాహన కుదుర్చుకున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో హ్యూమన్‌ లైబ్రరీని పాలక్కడ క్యాంప్‌సలో చేపడతారు. ఈ హ్యూమన్‌ లైబ్రరీలో తమ జీవిత అనుభవాలను వివరించే అవకాశం 12 మందికి మాత్రమే దక్కుతుంది. వీరికి ఎలాంటి వేతనాలు చెల్లించరు. ఐఐటీ పాలక్కడ్‌ నిపుణుల బృందం వీరిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురైన వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. సందర్శకులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆకట్టుకునేలా చెప్పేలా వారిని తీర్చిదిద్దుతారు. ఈ హ్యూమన్‌ లైబ్రరీలో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే సమాజంలో విభిన్న వర్గాల నుంచి మెయిల్స్‌ వస్తున్నాయని ఐఐటీ పాలక్కడ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుదర్శన్‌ తెలిపారు. ఓ దివ్యాంగుడు, ఓ ట్రాన్స్‌జెండర్‌ డాక్టర్‌ సహా మొత్తం ఏడుగురు తమను ఇప్పటికే సంప్రదించారని ఆయన చెప్పారు. వీరి అనుభవాలను నేరుగా వినడం ద్వారా సమాజంలో క్రమంగా మార్పునకు అవకాశం ఉంటుందన్నారు.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 03:54 AM