Share News

Deputy CM Ajit Pawar: నీకెంత ధైర్యం

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:38 AM

ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకున్న ఐపీఎస్‌ అధికారిణితో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వాగ్వాదానికి దిగారు. ..

Deputy CM Ajit Pawar: నీకెంత ధైర్యం

నన్నే వీడియో కాల్‌ చేయమంటావా?

  • మహిళా ఐపీఎస్‌తో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వాగ్వాదం

  • ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు ఆపేయాలని ఆదేశం

ముంబై, సెప్టెంబరు 5: ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకున్న ఐపీఎస్‌ అధికారిణితో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వాగ్వాదానికి దిగారు. వీరిద్దరి మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రోడ్డు నిర్మాణం కోసం సోలాపూర్‌ జిల్లా కుర్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారిణి అంజనా కృష్ణ ఆగస్టు 31న పోలీసు బలగాలు, రెవెన్యూ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. తవ్వకాలు సాగిస్తున్న వారిని అధికారులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎస్సీపీ కార్యకర్త ఒకరు నేరుగా అజిత్‌ పవార్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. తర్వాత ఆ ఫోన్‌ను అంజనా చేతికి అందించారు. తాను డిప్యూటీ సీఎంను మాట్లాడుతున్నానని, వెంటనే అక్కడి చర్యలను ఆపేయాలని ఆదేశించారు. దీనికి ఆమె స్పందిస్తూ... ‘‘ఫోన్‌లో మాట్లాడుతున్నదెవరో నాకెలా తెలుస్తుంది? నా నంబరుకు వీడియో కాల్‌ చేయగలరా?’’ అని కోరారు. దీంతో పవార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు అంత ధైర్యం ఉందా? మీపై చర్యలు తీసుకుంటా... నన్నే వీడియో కాల్‌ చేయమంటారా? నన్ను చూడాలనుకుంటున్నారా... మీ నంబరు ఇవ్వండి లేకపోతే నా నంబరుకు వాట్సాప్‌ కాల్‌ చేయండి... నీకెంత ధైర్యం’’ అంటూ కేకలు వేశారు. అనంతరం పవార్‌కు వీడియో కాల్‌ చేసిన అధికారిణి... ఆయన గొంతును గుర్తించలేకపోయినట్లు వివరణ ఇచ్చారు. అక్కడ తీసుకుంటున్న చర్యలను వెంటనే ఆపేయాలని పవార్‌ ఆమెను ఆదేశించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో పాటు పవార్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎస్సీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా లీక్‌ చేశారని ఎన్సీపీ ఎంపీ సునీల్‌ తట్కరే ఆరోపించారు. కార్యకర్తలను శాంతింపజేయడానికే అధికారిణిని పవార్‌ మందలించి ఉండొచ్చని, ఆమె విధులను అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు. కాగా, కేరళకు చెందిన అంజనా కృష్ణ 2022-23 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి. సోలాపూర్‌ జిల్లా కర్మాలా డీఎస్పీగా ఇటీవలే నియమితులయ్యారు. నిజాయితీ, అంకితభావానికి మారుపేరుగా గుర్తింపు పొందిన ఆమె సివిల్స్‌ పరీక్షల్లో 355వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి తిరువనంతపురంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు.


జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదు: పవార్‌

చట్టపరమైన అంశాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం తనకు లేదని, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు, అవి మరింత తీవ్రతరం కాకూడదనే ఆమెకు ఫోన్‌ చేశానని అజిత్‌ పవార్‌ శుక్రవారం వివరణ ఇచ్చారు. పోలీసు విభాగంపైనా, మహిళా అధికారులపైనా తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నామని, ఇసుక తవ్వకాలతో సహా చట్ట విరుద్ధమైన అన్ని కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పవార్‌ స్పష్టం చేశారు. కాగా, ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన అంజనా కృష్ణతో పాటు రెవెన్యూ అధికారులను విధులు నిర్వర్తించకుండా నిరోధించారనే ఆరోపణలపై పోలీసులు ఎన్సీపీ కార్యకర్తలు సహా పలువురిపై కేసు నమోదు చేశారు.

పవార్‌కు ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదు: రౌత్‌

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దొంగలను కాపాడుతున్నారని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఆయనకు ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదన్నారు. ‘‘చట్ట విరుద్ధ కార్యకలాపాలకు మద్దతివ్వమని ఒక ఐపీఎస్‌ అధికారిని అడుగుతున్న పవార్‌... ఇతరులకు మాత్రం చట్టాన్ని పాటించాలని ఉపదేశాలిస్తుంటారు. తన పార్టీ దొంగలకు రక్షణ కల్పించమని ఆమెను తిడుతున్నారు. ఇదేనా మీ క్రమశిక్షణ..? ఇసుకను అక్రమంగా తవ్వడమంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడమే. మీరు మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మంత్రులు సిగ్గుపడాలి. గతంలో ఇలాంటి ఘటనల కారణంగా చాలామంది నాయకులు నైతిక కారణాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది’’ అని రౌత్‌ గుర్తుచేశారు.


ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

For More National News and Telugu News

Updated Date - Sep 06 , 2025 | 04:38 AM