Hajj 2025 Rules: వీరికి హాజ్ 2025కు నో ఎంట్రీ.. దుబాయ్ కొత్త రూల్స్
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:53 PM
2025 హజ్ (Hajj 2025 Rules) యాత్ర ఈసారి మరింత సవాలుగా మారింది. ఎందుకంటే పెరిగిన వేడి తీవ్రతతోపాటు ఖర్చు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న అక్కడి ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇస్లాం మతానికి అత్యంత పవిత్రమైన యాత్రలలో హజ్ (Hajj 2025 Rules) ఒకటి. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాకు చేరుకుని ఈ యాత్రలో పాల్గొంటారు. అయితే 2025 హజ్ యాత్ర మాత్రం ఈసారి కొంత భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే అక్కడ పెరిగిన వేడి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కొత్త భద్రతా మార్గదర్శకాలను ప్రకటించింది.
వడ దెబ్బకి అప్రమత్తత
2024లో హజ్ సమయంలో 1,300 మందికి పైగా ముస్లింలు తీవ్రమైన వేడి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ (117°F) వరకు చేరాయి. దీనికి తగ్గట్లుగా ఈ సంవత్సరం సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని తెలిపింది. ప్రార్థనల సమయంలో తెల్లటి, తేలికపాటి బట్టలు ధరించాలని సూచించింది. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ లక్షణాలపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కిట్లను కూడా పంపిణీ చేస్తున్నారు.
పిల్లలకు హజ్ నిషేధం
మక్కాలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నందున, యాత్రికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు ఈ ఏడాది సౌదీ ప్రభుత్వం 12 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను హజ్‌కు అనుమతించకూడమని ప్రకటించింది. దీనికి ప్రధాన కారణాలు అధిక జనాభా, ఎండల తీవ్రత, భద్రత సమస్య అని వెల్లడించింది. పిల్లలు శారీరకంగా హజ్ చేయవలసిన అవసరం లేకపోయినా, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పవిత్ర స్థలాన్ని చూడాలని కోరుకుంటారు. ఈ నిబంధన వల్ల చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటివద్దే వదిలి వెళ్తున్నారు.
ఖర్చులు పెరగడం
హజ్ యాత్ర ఖర్చు కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉంది. దేశాన్ని బట్టి, విమాన తరగతి, నివాస సౌకర్యాలను బట్టి ఖర్చు USD 4,000 నుంచి 20,000 వరకు చేరింది. కరోనా తర్వాత ధరలు, పన్నులు, ముడి వస్తువుల ఖర్చు పెరిగిన నేపథ్యంలో ఇది మరింత భారంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని దేశాలు చెల్లింపులకు సౌకర్యవంతమైన ఎంపికలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఉదాహరణకు, పాకిస్థాన్ యాత్రికులు మూడు విడతలలో చెల్లింపు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే, సౌదీ లోపలనున్న యాత్రికులూ 20% అడ్వాన్స్ కట్టి, తర్వాత రంజాన్ సమయంలో 40%, మిగిలిన మొత్తాన్ని తదుపరి నెలలో చెల్లించే అవకాశం ఉంది.
నిషేధిత ప్రవేశాలు
హజ్ యాత్ర సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. దీంతోపాటు ప్రతి దేశానికి కోటాలు ఉండటంతో వేలాదిమంది యాత్రికులు వేచి ఉండాల్సి వస్తోంది. ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో దశాబ్దాలుగా వేయిటింగ్ లిస్ట్‌లు కొనసాగుతున్నాయి. భారతదేశం అధికారికంగా రిపీట్ హజ్ దరఖాస్తుదారులకు నిషేధం విధించింది. ఈసారి సౌదీ ప్రభుత్వం 14 దేశాలకు షార్ట్‌టెర్మ్ వీసాలు నిలిపివేసింది. ఇందులో భారతదేశం, పాకిస్థాన్, ఇండోనేషియా వంటివి ఉన్నాయి. హజ్ అనుమతి లేకుండా మక్కాలో ప్రవేశిస్తే 20,000 రియాల్స్ (సుమారు రూ.4.5 లక్షలు) వరకు జరిమానా విధిస్తారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి