H 1B visa Green card Hurdles Worsen: ఇప్పటికే కష్టం ఇకపై అసాధ్యమే
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:38 AM
అమెరికా హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల (శాశ్వత నివాస అనుమతి) విషయంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు.. భారీగా వీసా ఫీజుల పెంపు అశనిపాతంగా మారింది...
హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే
భారతీయుల ఇబ్బందులు..ఫీజు పెంపుతో మరింత సమస్య
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: అమెరికా హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల (శాశ్వత నివాస అనుమతి) విషయంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు.. భారీగా వీసా ఫీజుల పెంపు అశనిపాతంగా మారింది. అమెరికా ఏటా 85వేల హెచ్1బీ వీసాలు ఇస్తుంటే.. అందులో 70శాతానికిపైగా భారతీయ ఉద్యోగులకే దక్కుతూ వస్తున్నాయి. ఇతర దేశాల వారితో పోల్చితే మంచి నైపుణ్యం ఉండటం, తక్కువ వేతనాలకే పనిచేయడమే దీనికి కారణం. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పెడుతున్న నిబంధనలు, గ్రీన్‌కార్డుల కోసం పెరిగిపోయిన క్యూతో హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులు తగ్గిపోతున్నాయి. అందులోనూ భారతీయుల నుంచి దరఖాస్తులు బాగా పడిపోతున్నాయి. మొత్తంగా 2024లో 7,80,884 దరఖాస్తులురాగా.. 2025లో 4,70,342 దరఖాస్తులే వచ్చాయి. ఇక గ్రీన్‌కార్డుల కోసమైతే దశాబ్దాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. హెచ్1బీ వీసాల జారీలో దేశాల వారీగా పరిమితి ఏదీ లేకపోవడంతో భారతీయులకు ఎక్కువ దక్కుతున్నా.. గ్రీన్‌కార్డులకు మాత్రం గరిష్టంగా ఏడు శాతం పరిమితి ఉంది. దీనితో హెచ్1బీ వీసాదారుల్లో అత్యధికంగా ఉండే భారతీయులకు గ్రీన్‌కార్డు లభించడం కష్టంగా మారింది. గ్రీన్‌కార్డుల కోసం వేచి ఉన్నవారి సంఖ్య 18 లక్షలు అయుతే.. అందులో 11 లక్షల మంది భారతీయ ఉద్యోగులే. కొన్ని దేశాలకు చెందినవారు వేల మంది కూడా ఉండరు. అమెరికా ఏటా లక్షా 40వేల గ్రీన్‌కార్డులు ఇస్తుంది. అందులో గరిష్టంగా ఒక్కో దేశం నుంచి 9,800 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఏటా 9,800 మంది భారతీయులకు గ్రీన్‌కార్డు ఇచ్చినా.. లక్ష మందికి అందేందుకే పదేళ్లు దాటిపోతుంది. మిగతా వారికి రావాలంటే దశాబ్దాలు పడుతుంది. దానికితోడు అన్నేళ్లు వాళ్లు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండాల్సిందే. ఇప్పుడు హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్ల (రూ.88 లక్షలు)కు పెంచడం పిడుగుపాటుగా మారింది.
ఆ వీసాలకూ పదేళ్ల వెయిటింగ్..
హెచ్1బీ వీసాల జారీ కంపెనీల ఆఫర్ ఆధారంగా జరుగుతుంది. అంటే ఫలానా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చామని, అతడికి హెచ్1బీ వీసా ఇవ్వాలని కంపెనీలు దరఖాస్తు చేస్తాయి. అలాకాకుండా ప్రత్యేక రంగాల్లో ఉన్నతస్థాయి కోర్సులు చేసిన, నైపుణ్యమున్న వారు నేరుగా ఈబీ-2, ఈబీ-3 వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి కోసం భారీగా వెయిటింగ్ ఉంది. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం 2012 జనవరిలో దరఖాస్తు చేసుకున్నవారికి ఈబీ-2 వీసాలు, 2013 మేలో దరఖాస్తు చేసుకున్నవారికి ఈబీ-3 వీసాలు మంజూరు అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News