Share News

India Economic Reforms: నవ శకం ఆరంభం

ABN , Publish Date - Sep 22 , 2025 | 07:01 AM

‘‘నేటి నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతోంది. దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. నవతరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు...

India Economic Reforms: నవ శకం ఆరంభం

  • నేటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం

  • జీఎస్టీ 2.0తో పేద, మధ్య తరగతికి డబుల్‌ బొనాంజా

  • కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భరత, వేగంగా దేశాభివృద్ధి

  • ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించండి

  • జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సందేశం

నేటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం

  • ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించండి: మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘నేటి నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతోంది. దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. నవతరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. సోమవారం నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆదివారం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ అమ్మవారిని ఆరాధించే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి మొదటి రోజు నుంచే ఆత్మనిర్భర్‌ వైపు మరో కీలక అడుగు వేస్తున్నామన్నారు. మన దేశంలోని పేదలు, మధ్య తరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యవస్థాపకులు.. ఇలా అందరూ బచత్‌ ఉత్సవ్‌ (పొదుపు పండుగ) చేసుకోబోతున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని, వ్యాపారాన్ని సులభతరం చేస్తాయని, పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి రాష్ర్టాన్నీ సమాన భాగస్వామిగా చేయడంలో జీఎస్టీ సంస్కరణలు కీలక భూమిక పోషిస్తాయన్నారు. ‘‘దేశ ప్రజలు ఎంతో నమ్మకంతో 2014లో నాకు ప్రధానిగా బాధ్యతలు అప్పగించారు. మొదట్లోనే.. విదేశీ పత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒక కంపెనీ ఇబ్బందులను ప్రస్తావించింది. ‘బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు 570 కిలోమీటర్ల దూరం. వస్తువుల సరఫరాలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. మొదట బెంగళూరు నుంచి యూర్‌పకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తువులను పంపడం ఉత్తమంమని ఓ కంపెనీ భావించింది’ అనేది ఆ కథనంలోని సారాంశం. అప్పటికి దేశంలో పన్నులు, టోల్‌ ఇతర పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. ఆ రోజే దేశాన్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేయడం అత్యవసరమని నేను భావించాను. దేశంలోని అన్ని వర్గాల వారితో చర్చించి 2017లో జీఎస్టీతో కొత్త చరిత్రకు నాంది పలికాను. అదే భారతదేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలితంగా దేశం డజన్ల కొద్దీ పన్నుల నుంచి విముక్తి పొందింది. ఒకే దేశం-ఒకే పన్ను కల సాకారమైంది. అయితే.. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ. కాలం మారుతున్న కొద్దీ, దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం. అందుకే.. జీఎస్టీ 2.0ను ప్రవేశపెట్టి మరో చరిత్రకు నాంది పలికాం’’ అనే ప్రధాని మోదీ వివరించారు.


పేద, మధ్య తరగతికి డబుల్‌ బొనాంజా

మధ్య తరగతి ప్రజలకు డబుల్‌ బొనాంజా ఇచ్చామని మోదీ తెలిపారు. ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చామని, దానికితోడు జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని పేర్కొన్నారు. గడిచిన పదకొండేళ్లలో దేశంలో జీఎస్టీ వల్ల 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో దుకాణదారులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. దేశీయ ఉత్పత్తులపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని అన్నారు.

స్వదేశీ మంత్రం శక్తినిస్తుంది..

స్వదేశీ మంత్రం దేశ స్వాతంత్ర్యానికి శక్తినిచ్చినట్లే.. భారతదేశ శ్రేయస్సుకు కూడా శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ప్రస్తుతం మనకు తెలిసో, తెలియకో అనేక విదేశీ వస్తువులు దైనందిన జీవితంలో భాగమయ్యాయి. మన జేబులో ఉన్న దువ్వెన తయారు చేసింది విదేశీయులా? లేక స్వదేశీయులా? అనేది కూడా మనకు తెలియదు. దీని నుంచి మనం విముక్తి చెందాలి. ఇకపై.. దేశంలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయాలి. ప్రతి ఇంటినీ స్వదేశీ చిహ్నంగా మార్చాలి. ప్రతి దుకాణాన్నీ స్వదేశీ వస్తువులతో అలంకరించాలి. ఇది స్వదేశీ అని, నేను స్వదేశీ వస్తువులనే కొంటానని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పండి. నేను స్వదేశీ వస్తువులను కూడా అమ్ముతానని ప్రకటించండి. దీనివల్ల దేశంతోపాటు ప్రతి రాష్ట్రంలోని తయారీ రంగం ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. దీనికోసం సహకరించాలని నేను ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని మోదీ వివరించారు.

ఇవి కూడా చదవండి..

జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి

దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 07:01 AM