Google Maps Team Mistaken: గూగుల్ మ్యాప్స్ టీమ్‌కు ఊహించని షాక్.. చితక్కొట్టిన గ్రామస్తులు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:47 PM
గ్రామస్తులు గూగుల్ మ్యాప్స్ టీమ్ పై దాడి చేయటం మొదలెట్టారు. ఈ సమాచారం స్థానిక పోలీసులకు వెళ్లింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను, గూగుల్ మ్యాప్స్ టీమ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ వాడే వారికి గూగుల్ మ్యాప్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏదైనా లొకేషన్ గురించి తెలియనప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దారి వెతుక్కోవటం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడతారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ సంస్థ తమ కస్టమర్లకు మరింత చక్కని అనుభూతి ఇవ్వడానికి గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది. ఉన్న లోపాలను సరిచేసుకుంటూ కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ వెళుతోంది. గూగుల్ సంస్థ గత కొద్ది రోజుల నుంచి స్ట్రీట్స్ మ్యాపింగ్ మెదలెట్టింది.
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గూగుల్ మ్యాప్స్ టీమ్ స్ట్రీట్స్ మ్యాపింగ్ చేస్తూ ఉంది. గురువారం రాత్రి టీమ్ కాన్పూర్‌లోని ఓ గ్రామంలోకి వెళ్లింది. టీమ్ సభ్యులు గ్రామంలోని వీధులను కారు పైభాగంలో అమర్చిన కెమెరాతో ఫొటోలు తీస్తూ ఉన్నారు. గ్రామస్తులు ఆ కారును చూశారు. దొంగలు దొంగతనం కోసం రెక్కీ నిర్వహిస్తున్నారని, అందుకే ఫొటోలు తీస్తున్నారని అనుకున్నారు. నిమిషాల్లో జనం గూగుల్ మ్యాప్స్ టీమ్ కారును చుట్టుముట్టారు. ‘ఏం చేస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు.
వారు ఏం సమాధానం చెప్పారో తెలీదు కానీ.. గ్రామస్తులు వారిపై దాడి చేయటం మొదలెట్టారు. ఈ సమాచారం స్థానిక పోలీసులకు వెళ్లింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను, గూగుల్ మ్యాప్స్ టీమ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత తాము ఎందుకు వచ్చామో గూగుల్ టీమ్ వారికి వివరించి చెప్పింది. దీంతో గ్రామస్తులు చల్లబడ్డారు. గత కొద్దిరోజుల నుంచి గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని, ఆ భయంతోటే గూగుల్ టీమ్‌పై దాడి చేశామని వారు చెప్పారు. ఇక, గూగుల్ టీమ్ గ్రామస్తులపై కేసు పెట్టలేదు. మళ్లీ మ్యాపింగ్ చేయడానికి అదే గ్రామంలోకి వెళ్లారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో పరుగులు పెట్టనున్న జపాన్ బుల్లెట్ ట్రెయిన్.. అదిరిపోయే ఫీచర్స్
IRCTC కూర్గ్ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికుల కోసం స్పెషల్ ఆఫర్