Share News

Military Action on Pakistan: సైనికంగా బుద్ధి చెప్పేందుకు నాలుగు మార్గాలు

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:53 AM

పాక్‌పై సైనిక చర్యలకు సంబంధించిన నాలుగు కీలక మార్గాలను రక్షణ నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. వీటిలో ఆధునిక యుద్ధ విమానాలతో దాడులు, నియంత్రణ రేఖ వెంట దాడులు, సర్జికల్‌ దాడులు, మరియు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయడం ఉన్నాయి

Military Action on Pakistan: సైనికంగా బుద్ధి చెప్పేందుకు నాలుగు మార్గాలు

పాక్‌పై మిలటరీ చర్యల అంశంలో రక్షణ నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: పహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ సైనికపరంగా ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే దానిపై రక్షణ రంగ నిపుణులు నాలుగు అంశాలను వివరిస్తున్నారు.

ఆధునిక యుద్ధ విమానాలతో దాడి

రఫేల్‌, మిరేజ్‌ 2000 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, వాటికి అమర్చిన క్షిపణులతో పాకిస్థాన్‌లోని లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో ఉగ్ర, మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు అవకాశం ఉంటుంది. పాక్‌కు భారీ నష్టం కలిగించవచ్చు. అయితే ఇది ఒక రకంగా యుద్ధానికి పురికొల్పడమే. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.


నియంత్రణ రేఖ వెంట దాడులు

పాకిస్థాన్‌ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ)కు విలువ లేకుండా పోతుంది. అంటే మన సైన్యం దాన్ని దాటి ముందుకు చొచ్చుకెళ్లి.. పాక్‌ ఔట్‌పోస్టులు, ఉగ్ర స్థావరాలపై దాడి చేయవచ్చు. కానీ అక్కడి భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేక ఇబ్బంది తప్పదు. పాక్‌ సైన్యం ముందే సిద్ధంగా ఉండి దూకుడుగా ప్రతిదాడి చేయవచ్చు. నష్టం ఇరువైపులా ఉంటుంది.

సర్జికల్‌ దాడులు

వ్యూహాత్మక మిలటరీ స్థావరాలు, ఉగ్ర క్యాంపులపై సర్జికల్‌ దాడులు చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ ముందే సిద్ధంగా ఉండే అవకాశాలు ఎక్కువ. పక్కా ప్రణాళిక, లక్ష్యాల వద్ద పరిస్థితిని నిరంతరం గమనించే నిఘా, అధునాత బలగాలు అవసరం. దీనితో పాక్‌కు కలిగే నష్టం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు.

సరిహద్దు ఇవతలి నుంచే

నియంత్రణ రేఖ లోపలే ఉండి.. శతఘ్నులు, భారీ మోర్టార్లు, గన్‌లతో నియంత్రణ రేఖ వెంట పాక్‌ స్థావరాలు, ఔట్‌పోస్టులు, సరఫరా వ్యవస్థలను ధ్వంసం చేయవచ్చు. కచ్చితంగా గురిపెట్టి లక్ష్యాలను ఛేదించే స్నైపర్‌ ఆపరేషన్లు నిర్వహించవచ్చు. కానీ దీనివల్ల ఆ దేశానికి జరిగే నష్టం పరిమితంగానే ఉంటుంది.

Updated Date - Apr 26 , 2025 | 03:53 AM