Prayagraj Flood: ఉత్తరప్రదేశ్‌లో వరదలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:30 AM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు.. 17 జిల్లాలు జలమయం
ప్రమాద స్థాయిని దాటిప్రవహిస్తున్న పలు నదులు
నీట మునిగిన వందలాది గ్రామాలు
ప్రయాగ్‌రాజ్‌లో 15 వేల ఇళ్లలోకి నీరు
కొనసాగుతున్న సహాయక చర్యలు
లఖ్‌నవూ, ఆగస్టు 3: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వందలాది గ్రామా లు, కొన్ని నగరాలు పూర్తిగా నీట మునిగాయి. జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాన్పూర్‌నగర్, లఖింపూర్ ఖేరీ, ఆగ్రా, ఔరారియా, చిత్రకూట్, బల్లియా, బండా, ఘాజీపూర్, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్, వారాణసీ, చందౌలీ సహా 17 జిల్లాలను వరదలు ప్రభావితం చేశాయి. గంగా, యమునా, రామగంగా, గోమతి సహా పలు నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్, వారాణసీ నగరాలు పూర్తిగా నీట మునిగాయి. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 15 వేల ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో పీకల్లోతు వరద నీటిలో సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల తాలుకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వరదలతో 37 తహసీళ్లలోని 402 గ్రామాలకు చెందిన 84,392 మంది ప్రజలు ప్రభావితమయ్యారు.

47 వేలకు పైగా మందికి తక్షణ సాయం అందించాం. క్షేత్రస్థాయిలో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. 493 పడవలు, బోట్ల ద్వారా ఆహారం ప్యాకెట్లు, అవసరమైన సామగ్రిని పంపిణీ చేస్తున్నాం’ అని విపత్తు నిర్వహణ కమిషనర్ భానుచంద్ర గోస్వామి ఓ ప్రకనటలో తెలిపారు. మంత్రి స్వతంత్రదేవ్ సింగ్ హమీర్‌పూర్‌లోని వర ద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సహాయక శిబిరాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఇక రాబోయే 24 గంట ల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. వరదల నేపథ్యంలో సర్కారుపై ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును బీజేపీ అపహాస్యం చేసిందని విమర్శించారు. ‘ప్రయాగ్‌రాజ్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా అక్కడి ప్రజలకు వరద ముంపు కష్టాలు తప్పలేదు. బీజేపీ నేతల అవినీతిని అక్కడి నీటి గుంతలే స్పష్టం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ భావనపై నీళ్లు చల్లిన కాషాయ పార్టీ నేతలు తమ పడవల్లో ఎక్కడికో అదృశ్యమయ్యారు?’ అంటూ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి