Share News

Fake IAS Officer: ఖరీదైన వాహనాలతో కాన్వాయ్‌.. బాడీగార్డులకు పోలీసు డ్రెస్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:30 AM

యువ ఐఏఎస్‌ ముసుగులో దందాలు చేసిన ఫేక్‌ అధికారి సౌరభ్‌ త్రిపాఠిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు..

Fake IAS Officer: ఖరీదైన వాహనాలతో కాన్వాయ్‌.. బాడీగార్డులకు పోలీసు డ్రెస్‌

  • యూపీలో నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌

  • ప్రభుత్వ భేటీలకూ సౌరభ్‌ హాజరు

లఖ్‌నవూ, సెప్టెంబరు 5: యువ ఐఏఎస్‌ ముసుగులో దందాలు చేసిన ఫేక్‌ అధికారి సౌరభ్‌ త్రిపాఠిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వస్థాయిలో జరిగే అతి ముఖ్యమైన భేటీల నుంచి ఉన్నతాధికారులు ఇచ్చే పార్టీలవరకు..అన్నింటికీ రాచబాటలో త్రిపాఠి హాజరయిన వైనం దర్యాప్తు అధికారులనే నివ్వెరపరుస్తోంది. చివరకు అంతర్గత సమావేశాలకూ ఐఏఎస్‌ దర్జాతో వెళ్లివచ్చేవాడని, మంత్రులను కలుసుకుని సెల్ఫీలు దిగేవాడని తెలుసుకుని ప్రభుత్వ వర్గాలు విస్మయం చెందుతున్నారు. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని హైసెక్యూరిటీ జోన్లను సైతం ఛేదించుకుని ప్రభుత్వాన్ని, పోలీసులను, వ్యాపారులను ఓ 36 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లపాటు బురిడీ కొట్టించిన తీరు ఐఏఎస్‌ వర్గాలను దిగ్భ్రమకు గురిచేసింది. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ స్పెషల్‌ అధికారి ఐడీతో త్రిపాఠి చలామణి అయ్యాడు. యూపీ దాటి బయటకు వెళితే కేంద్ర ప్రభుత్వ అధికారిని అని చెప్పుకొనేవాడు. ఎక్కడకు వెళ్లినా ఆరేడు వాహనాలతో కాన్వాయ్‌ ఏర్పాటుచేసుకునేవాడు. ప్రైవేటు బాడీగార్డులను పోషించేవాడు. వారిలో ఒకరికి పోలీస్‌ యూనిఫాం వేసి.. వారందరితోకలిసి ప్రభుత్వ కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడు.. సెక్యూరిటీ సిబ్బంది ఆటోమెటిక్‌గా పక్కకు తప్పుకొని దారి ఇచ్చేవారు. అత్యంత సంపన్నులు, పారిశ్రామికవేత్తలు ఉండే విలాసవంతమైన భవనాల్లో నివసించేవాడు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం రేంజ్‌ రోవర్‌ వాడితే, దందాల కోసం మెర్సిడెస్‌ బెంజ్‌ సీ 220 లేక డిఫెండర్‌ను బయటకుతీసేవాడు. లఖ్‌నవూలో ఇటీవల వాహనాల తనిఖీ సందర్భంగా త్రిపాఠి అసలు రంగు బయటపడింది. కాన్వాయ్‌ల నుంచి బాడీగార్డులు, ఐడీ కార్డుల వరకు.. అంతా ఫేకేనని గుర్తించి, ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపించారు. ఈయన ఫేక్‌ అని త్రిపాఠి దగ్గర పనిచేసిన అసిస్టెంట్‌ కూడా తెలుసుకోలేకపోయాడని, అంతగా అందరినీ ఆయన నమ్మించగలిగాడని లఖ్‌నవూ డీసీపీ (క్రైమ్‌) కమలేశ్‌ దీక్షిత్‌ తెలిపారు. సౌరభ్‌ ఐఏఎస్‌ కాదని తెలిసి అతని మిత్రులు కూడా షాక్‌ అయ్యారు.


ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

For More National News and Telugu News

Updated Date - Sep 06 , 2025 | 04:31 AM