Delhi Election Results: మూడోసారి ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్.. కారణాలు ఇవేనా!?
ABN , Publish Date - Feb 08 , 2025 | 07:43 PM
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హ్యాట్రిక్ ఓటమికి పలు వ్యవస్థాగత కారణాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఫలితాలపై సమీక్షలు మొదలయ్యాయి. పార్టీ విజయాలకు, ఓటములకు కారణాలపై విశ్లేషణలు వెలువడతున్నాయి. ఆప్ పరాజయం, బీజేపీ విజయం అటుంచితే కాంగ్రెస్ ఓటమికి పలు ముఖ్య కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. 2013కు పూర్వ 15 ఏళ్ల పాటు దేశరాజధానిలో కాంగ్రెస్ పాలన సాగింది. కానీ ఆప్ ఎంట్రీతో వెనకబడ్డ కాంగ్రెస్ నేటి వరకూ కోలుకోలేకపోయింది. ఇక తాజా ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిల పడింది.
ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 36 కాగా బీజేపీ ఏకంగా 48 సీట్లు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో 67 సీట్లు గెలిచిన ఆప్ ఈసారి కేవలం 22 సీట్లకు పరిమితం అయ్యింది. ఇక కాంగ్రెస్ మూడోసారి కూడా ఖాతా తెరవలేదు.
2013లో ఆప్ అవినీతి వ్యతిరేక ప్రచారంతో ఢిల్లీలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ కేవలం 8 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఓటమి నుంచి కోలుకునేందుకు వ్యూహం మార్చుకుని, బలమైన స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సి ఉండగా కాంగ్రెస్ ఇందులో విఫలమైందనేది మెజారిటీ విశ్లేషకుల మాట (New Delhi Election Results).
BJP Victory: ఢిల్లీ విజయాన్ని కట్టబెట్టిన బీజేపీ వ్యూహం ఇదీ!
ఢిల్లీలో సరికొత్త పాలన తమతోనే సాధ్యమని ఆప్ 2013 నుంచీ హోరెత్తిస్తోంది. బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న అనేక మందికి కాంగ్రెస్‌కు బదులు ఆప్‌ను ఎంచుకున్నారు. కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే మైనారిటీలు, పేదలు, దిగువ మధ్యతరగతి వారందరూ ఆప్ ప్రచారానికి ఆకర్షితులైన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. దీనిపి ప్రతి వ్యూహాన్ని అనుసరించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇక ఢిల్లీలో స్థానిక నాయకత్వం బలంగా లేకపోవడంతో కూడా కాంగ్రెస్‌కు ప్రతికూలించిన ప్రధాన అంశం. ఆప్‌కు కేజ్రీవాల్, బీజేపీకి నరేంద్ర మోదీ ఉండగా కాంగ్రెస్‌కు పాప్యులర్ నేతలు కరువయ్యారు. షీలా దీక్షిత్ తరువాత అంతటి బలమైన నాయకత్వం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో కానరాకపోవడం మైనస్‌గా మారింది. ఇక పార్టీలో లుకలుకలు కూడా ఓటమికి బాటలు వేశాయి.
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ వ్యూహంలో తికమక కూడా ఓటమికి ఓ ప్రధాన కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి బరిలోకి దిగిన హస్తం పార్టీ నెలల వ్యవధిలోనే ఆప్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలవడం ఓటర్లను తికమకపెట్టింది. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ఇది అంతిమంగా కాంగ్రెస్, ఆప్‌కు ప్రతిబంధకంగా మారింది. ఆప్‌తో పాటు, బీఎస్పీ, ఎమ్ఐఎమ్, చిన్న పార్టీలు బరిలో నిలవడంతో కాంగ్రెస్ ఓటు చీలిపోయింది.
ఇక ఢిల్లీ వాసులను వేధిస్తున్న కాలుష్యం, మౌలికవసతుల లోపం, నిరుద్యోగం సమస్యలకు ఓటర్లను ఆకర్షించే స్థాయిలో ప్రత్యామ్నాయ పరిష్కారాలను కాంగ్రెస్ ముందుంచలేకపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలపై ప్రచారంతో ఆప్, అభివృద్ధి, స్థిరత్వం తెస్తామంటూ బీజేపీ చేసిన ప్రచారాల ముందు కాంగ్రెస్ హామీలు ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి