Share News

Donald Trump: గాజాలో యుద్ధాన్ని ఆపండి..!

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:37 AM

గాజాలో యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ భద్రతా సంస్థలకు చెందిన విశ్రాంత ఉన్నతాధికారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు.

Donald Trump: గాజాలో యుద్ధాన్ని ఆపండి..!

  • ట్రంప్‌కు ఇజ్రాయెల్‌ భద్రతా సంస్థల మాజీ అధికారుల లేఖ

వాషింగ్టన్‌, ఆగస్టు 4: గాజాలో యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ భద్రతా సంస్థలకు చెందిన విశ్రాంత ఉన్నతాధికారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. 600 మందికి పైగా విశ్రాంత అధికారులు, నిఘా సంస్థల మాజీ అధిపతులు ఈ మేరకు అమెరికా అధ్యక్షుడికి ఓ లేఖ రాశారు. హమాస్‌ ఇకపై ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక ముప్పు కాదని పేర్కొన్నారు. హమా్‌సతో కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడం.. నెతన్యాహు గాజాపై దాడులను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ లేఖ రాసిన వారిలో మొసాద్‌ మాజీ చీఫ్‌ తమీర్‌ పర్దో, షిన్‌ బెట్‌ మాజీ చీఫ్‌ అమీ అయలోన్‌, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌ తదితరులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌ను నెతన్యాహు వినాశనం వైపు నడిపిస్తున్నారని.. సైనిక లక్ష్యాలను సాధించినప్పటికీ యుద్ధాన్ని కొనసాగించడం సరికాదని వారు పేర్కొన్నారు. అయితే, గాజాలో ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్నది నరమేధం కాదని, అది యుద్ధమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. గాజాలో చిన్నపిల్లల ఆకలి చావుల దృశ్యాలను సోమవారం ట్రంప్‌ ఎదుట ప్రస్తావించిన విలేకరులు దాన్ని నరమేధంగా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, ట్రంప్‌ పైవిధంగా స్పందించారు.

Updated Date - Aug 05 , 2025 | 05:37 AM