Share News

Qureshi Urges EC to Probe: రాహుల్‌ ఆరోపణలపై విచారణకు ఆదేశించాల్సింది

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:41 AM

‘ఓట్ల చోరీ’ అంశంపై ఎన్నికల కమిషన్‌(ఈసీ) స్పందించిన తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌.వై. ఖురేషీ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే...

Qureshi Urges EC to Probe: రాహుల్‌ ఆరోపణలపై విచారణకు ఆదేశించాల్సింది

ప్రతిపక్ష నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదు

  • ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి

  • మాజీ సీఈసీ ఖురేషీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: ‘ఓట్ల చోరీ’ అంశంపై ఎన్నికల కమిషన్‌(ఈసీ) స్పందించిన తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌.వై. ఖురేషీ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే బదులు ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ‘హైడ్రోజన్‌ బాంబు’ వంటి పదాలతో రాహుల్‌ తన రాజకీయ వాక్చాతుర్యాన్ని జోడిస్తూ ఆరోపణలు చేశారని, అయినా వాటిపై సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ఈసీ నిర్వహించిన విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. ఇది సమస్యలను ఆహ్వానించడమేనని అన్నారు. ఎన్నికల కమిషన్‌ను ఎవరైనా విమర్శిస్తే ఈసీ మాజీ కమిషనర్‌గానే కాకుండా ఒక భారత పౌరుడిగా తనకు తీవ్ర ఆవేదన కలుగుతుందని చెప్పారు. కమిషన్‌ పురోగతిలో తనకూ పాత్ర ఉందన్నారు. ఎన్నికల విషయంలో తమ పనితీరును ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఖురేషీ సూచించారు. తమ నిర్ణయాలను ప్రభావితం చేసే అన్ని రకాల శక్తులను, ఒత్తిళ్లను కమిషన్‌ అధికారులు ఎదుర్కోవాలన్నారు. వారు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని, ప్రతిపక్ష పార్టీల విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. తాను సీఈసీగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. తనను కలవడానికి ప్రతిపక్ష నేతలు అపాయింట్‌మెంట్‌ కోరితే వెంటనే ఇచ్చేవాడినని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షాలు తరచుగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందని, తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని, తమ మాట వినేవారే లేరని 23 రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయని చెప్పారు. ‘‘వారు చెప్పేది వినండి, వారితో మాట్లాడండి, వారు ఏదైనా చిన్న సాయం కోరితే .. అది మరొకరికి నష్టం కలిగించనిది అయితే చేయండి’’ అని మాజీ సీఈసీ సూచించారు.


లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారి అభిప్రాయాలను వినిపిస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై అఫిడవిట్‌ సమర్పించమని కోరే బదులు దర్యాప్తునకు ఈసీ ఆదేశించి ఉండాల్సిందన్నారు. ‘‘మీరు తీసుకొచ్చే కొత్త ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేవని అఫిడవిట్‌ ఇవ్వమని ప్రతిపక్షాలు కూడా అడిగితే ఏం చేస్తారు? ఒకవేళ అందులో ఏదైనా తప్పులు ఉంటే మీపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామంటే మీ పరిస్థితేంటి?’’ అని ఆయన ఈసీని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడే కాదు ఎవరు ఫిర్యాదు చేసినా దర్యాప్తుకు ఆదేశించడమే సరైన పద్ధతి అన్నారు. కాగా, ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. రాజకీయ పార్టీలతో తాము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని ఇంత నిర్మాణాత్మక రీతిలో మరెప్పుడూ జరగలేదని ఈసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక నేపాల్‌ పరిణామాలపై ఖరేషీ మాట్లాడుతూ, అవి సజీవమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి సంకేతాలుగా అభివర్ణించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్‌ మీడియా అంతర్భాగంగా మారిన నేపథ్యంలో దాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 06:41 AM