Share News

ECI: మహారాష్ట్ర ఎన్నికల ఆరోపణలపై ఈసీ నుంచి రాహుల్‌కు పిలుపు

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:44 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ ఇటీవల ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నియోజకవర్గంలో 8 శాతం ఓటర్లు పెరిగారని అన్నారు.

ECI: మహారాష్ట్ర ఎన్నికల ఆరోపణలపై ఈసీ నుంచి రాహుల్‌కు పిలుపు

న్యూఢిల్లీ: గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పదేపదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు రావాల్సిందిగా ఆయనను భారత ఎన్నికల కమిషన్ (ECI) పిలిచింది. జూన్ 12న ఈ మేరకు రాహుల్‌కు ఈసీ లేఖ రాసిందని, ఆయన నివాసానికి లేఖ అందిందని విశ్వసనీయ వర్గాలు మంగళవారంనాడు తెలిపాయి.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు ఉన్నాయని రాహుల్ ఇటీవల ఆరోపించారు. ఎన్నికల వీడియో ఫుటేజ్, ఫోటోలను ఎన్నికల ఫలితం వెలువడిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఈసీఐ ఆదేశించడం తమ అనుమానాలను మరింత బలపరుస్తోందని అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.


ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సరళి రికార్డింగ్ తప్పనిసరి కాదని, పారదర్శకత కోసం ఓటింగ్ ప్రక్రియను రికార్డు చేయిస్తున్నామని ఈసీ తెలిపింది. ఆ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో కొందరు దుర్వినియోగం చేస్తుండటాన్ని గుర్తించామని, ఆ కారణంగానే 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదు రాకపోతే ఫుటేజ్‌లు తొలగించాలని నిర్ణయించామని పేర్కొంది.


కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ ఇటీవల ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నియోజకవర్గంలో 8 శాతం ఓటర్లు పెరిగారని, కొన్ని బూత్‌లలో 20 నుంచి 50 శాతం ఓటర్లు పెరిగారని 'ఎక్స్' వేదికగా ఆరోపించారు. వెరిఫైడ్ అడ్రస్ లేని ఓటర్లు వేలల్లో ఉన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. ఇది ఓట్ల దొంగతనం కాదా? అని ప్రశ్నించారు. ఆ కారణంగానే తాము మెషీన్ రీడబుల్ డిజిటల్ ఓటర్ల జాబితాను, సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తు్న్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

బ్లాక్‌ బాక్స్ ఊహాగానాలపై కేంద్ర మంత్రి క్లారిటీ

హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌..

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:46 PM