Election commission: వివక్షకు తావులేదు..అన్నీ పార్టీలూ సమానమే: ఈసీ
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:58 PM
భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ ఎలాంటి వివక్షకు తావీయదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) అన్నారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఎన్నికల కమిషన్ ఆదివారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఈసీతో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు ఏ పార్టీ పట్ల విముఖత ఉండదని, అన్ని పార్టీలు సమానమేనని చెప్పారు. ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా రాజ్యాంగ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ వెనక్కు మళ్లే ప్రసక్తే లేదన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు రిజిస్టర్ చేసుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని సీఈసీ అన్నారు. తమకు అన్ని పార్టీలు సమానమేనని, పార్టీల సిద్ధాంతాలు, అఫిలియేషన్‌తో తమకెలాంటి సంబంధం ఉండదని, చట్టప్రకారం అందర్నీ సమనంగా చూస్తామని వివరించారు.
తప్పుడు ఆరోపణలకు భయపడం
బిహార్ ఎస్ఐఆర్‌పై జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, డబుల్ ఓటింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు చేసేటప్పుడు ప్రూఫ్ ఉండాలని, ఫ్రూవ్‌లు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. 'కొందరు డబుల్ ఓటింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రూఫ్ అడిగితే జవాబు ఇవ్వడం లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు ఎన్నికల కమిషన్ కానీ, ఓటర్లు కానీ భయపడరు. దేశ ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల కమిషన్ భుజంపై తుపాకి పెట్టే రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. పేదలు, ధనికులు, వృద్ధులు, యువకులు, మహిళలు, మతం, సామాజిక-అర్థిక హోదా అనే వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ అండగా నిలుస్తోంది. ఇకముందు కూడా నిలుస్తుంది. ఎన్నికల కమిషన్ నిర్భీతిగా వ్యవహరిస్తుంది' అని స్పష్టం చేశారు.
రాజ్యాంగం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో భారత పౌరులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులని సీఈసీ చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో విదేశీ జాతీయులు ఎవరైనా దరఖాస్తులు సమర్పిస్తే వాళ్లు తమ జాతీయతను తగిన డాక్యుమెంట్లతో సహా రుజువు చేసుకోవాలని, వెరిఫికేషన్ తరువాత నాన్ సిటిజన్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. బీహార్ ఎస్ఐఆర్‌ను విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అంతా కృష్ణమయం... ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని
జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌ల విలయం.. అసలెందుకిలా జరుగుతోంది..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి