EC Notice To Tejashwi Yadav : తేజస్వికి ఈసీ నోటీసు
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:46 AM
బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ ఈసీ నోటీసు జారీచేసింది.
ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించారంటూ మీరు చూపించిన ఓటరు కార్డు మేం జారీచేసింది కాదు
అసలు కార్డును అప్పగించండి: ఈసీ
పట్నా/న్యూఢిల్లీ, ఆగస్టు 3: బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటీసు జారీచేసింది. ఆయన శనివారం చూపిన ఓటరు గుర్తింపు కార్డు అధికారికంగా జారీచేసింది కాదని.. దర్యాప్తు జరపడానికి వీలుగా దాని ఒరిజినల్ కార్డును తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు పట్నా సదర్ సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్, దీఘా అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టొరల్ రిజస్ట్రేషన్ అధికారి ఆయనకు ఆదివారం నోటీసు పంపారు. శనివారం బిహార్లో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ తేజస్వి పాత ఓటరు కార్డును మీడియా సమక్షంలో చూపారు. అయితే జిల్లా మేజిస్ట్రేట్ ఎస్‌ఎం త్యాగరాజ వెంటనే దీనిని ఖండించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి తన అఫిడవిట్‌లో పొందుపరచిన ఎపిక్ నంబరు అది కాదని.. ఆయన వద్ద రెండో ఓటరు కార్డు గనుక ఉంటే.. ఇది విచారణ జరపాల్సిన అంశమని తెలిపారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గ ఎన్నిల అధికారి స్పందించారు. ‘ఓటరు జాబితాలో మీ పేరు 204వ పోలింగ్ బూత్‌లో సీరియల్ నంబరు 416గా నమోదై ఉంది. దాని ఎపిక్ నంబరు ఆర్‌ఏబీ0456228. కానీ మీడియా సమావేశంలో మీరు చూపించిన ఎపిక్ నంబరు ఆర్‌ఏబీ2916120. అసలీ నంబరు మేం అధికారికంగా జారీచేసింది కాదని మా ప్రాథమిక విచారణలో తేలింది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, తమిళనాడులో 6.5 లక్షల మంది వలస కార్మికులను ఓటర్లుగా చేర్చారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. ఇది ఆందోళనకర, చట్టవిరుద్ధమైన చర్య అని అభివర్ణించారు. కానీ, చిదంబరం ఆరోపణలను ఈసీ ఖండించింది. తమిళనాడులో ఇంకా ఎస్‌ఐఆర్ అమలు చేయలేదని, 6.5 లక్షల ఓట్లను చేర్చారనడం అబద్ధమని పేర్కొంది.
8న ఈసీ వద్దకు ఇండీ కూటమి ర్యాలీ
బిహార్‌లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష ఇండీ కూటమి నేతలు ఈ నెల 7న రాత్రి సమావేశం కానున్నారని సమాచారం. ఈసీ వైఖరికి నిరసనగా ఈ నెల 8న ఆ సంస్థ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించాలని కూటమి పక్షాల నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపైన కూడా 7న చర్చ జరుగుతుందని పలువురు ఇండీ కూటమి నేతలు సంకేతాలిచ్చారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి