Share News

EC Meets Parties Ahead: దేశవ్యాప్త సర్‌ పై పార్టీలతో ఈసీ భేటీ

ABN , Publish Date - Sep 26 , 2025 | 06:26 AM

బిహార్‌ తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌) నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిర్ణయించింది. బిహార్లో రాజకీయ...

EC Meets Parties Ahead: దేశవ్యాప్త సర్‌ పై పార్టీలతో ఈసీ భేటీ

రాష్ట్రాల సీఈవోలకు నిర్దేశం.. బిహార్‌ వివాదంతో కమిషన్‌ నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: బిహార్‌ తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌) నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిర్ణయించింది. బిహార్లో రాజకీయ పార్టీలను సంప్రదించకుండా.. ఈ ప్రక్రియను చేపట్టి విపక్షాల ఆగ్రహానికి గురైన ఈసీ.. ఇప్పుడు దేశవ్యాప్త ప్రక్రియ మొదలుపెట్టే ముందే పార్టీలతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారు(సీఈవో)లు వాటితో సమావేశాలు జరపాలని నిర్దేశించింది. వాస్తవానికి దేశమంతటా ఎన్నికల జాబితాలను సవరించాలని జూన్‌ 24నే ఆదేశాలు జారీచేసింది. పార్టీలను సంప్రదించకుండా మర్నాటి నుంచే రిజిస్టరైన ఓటర్లంతా కొత్త ఎన్యుమరేషన్‌ ఫారాలను పూర్తిచేసి.. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశించి.. ఆ ఫారాల పంపిణీ ప్రారంభించింది. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో హడావుడిగా అక్కడ ఎస్‌ఐఆర్‌ చేపట్టింది. సెప్టెంబరు 30న ఈ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ప్రచురించి ఈ ప్రక్రియను ముగించాలని నిర్ణయించింది. ఈ లోపల కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలో ఓటరు అధికార యాత్ర’ నిర్వహించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ప్రతిపక్షాల ఓట్లను తొలగించాలని చూస్తోందని.. ఓట్ల చోరీ ద్వారా అధికారంలోకి రావాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్త ఎస్‌ఐఆర్‌ను ఎప్పుడు ప్రారంభించాలో ఈసీ ఇంకా నిర్ణయించనప్పటికీ.. అందుకు సీఈవోలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈనెల 10న వారితో ఢిల్లీలో సమావేశంకూడా నిర్వహించింది. బిహార్లో ఈ ప్రక్రియ నిర్వహించేటప్పుడు ఎ దురైన ఇబ్బందులు.. సజావుగా ముగించేందుకు తాము అమలు చేసిన వ్యూహాలు, విధానాలపై ఆ రాష్ట్ర సీఈవో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ రాష్ట్రంలో భారీసంఖ్యలో నేపాల్‌, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు ఓటుహక్కు పొందారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈసీ అక్కడ ఎస్‌ఐఆర్‌ చేపట్టింది. అయితే ఓటర్ల పౌరసత్వ చట్టబద్ధతను ప్రశ్నించడానికి కమిషన్‌కు ఎలాంటి అధికారమూ లేదని కాంగ్రెస్‌, ఆర్జేడీ సహా పలు ప్రతిపక్షాలు వాదించాయి. అసలు ఎస్‌ఐఆర్‌ చేపట్టే అధికారమే దానికి లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఓటర్ల పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారాన్ని 326వ అధికరణ తమకు దఖలుపరచిందని ఈసీ స్పష్టంచేసింది. భారతీయ పౌరులకు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకునే హక్కుందని ఈ అధికరణ చెబుతోందని పేర్కొంది.


బిహార్లో ఈబీసీలకు సంపూర్ణ హక్కులు

  • బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ప్రైవేటు కాలేజీలు, వర్సిటీల్లో రిజర్వేషన్‌: రాహుల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అబద్ధాలు ప్రచారం చేసినా.. బిహార్లో బీసీలకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు మహాగఠ్‌బంధన్‌ (మహాకూటమి) కట్టుబడి ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. బుధవారం పట్నాలో ‘అతి పిఛ్‌డా న్యాయ్‌ సంకల్ప్‌ పాత్ర’ను ప్రారంభించిన ఆయన.. గురువారం దీనిపై ‘ఎక్స్‌’లో స్పందించారు. అత్యం త వెనుకబడిన వర్గాలు, బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలను బలోపేతం చేసి.. వారికి మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ‘సంకల్ప్‌ పాత్ర’లో నిర్మాణాత్మక హామీలిచ్చామని తెలిపారు. ఈ వర్గాల అభ్యున్నతికి విద్యే కీలకమని.. ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వీరికి రిజర్వేషన్‌ కల్పిస్తామని.. ప్రైవే టు స్కూళ్లలో 50ు కోటా ఇస్తామన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ‘అర్హులైన అభ్యర్థులు లేరు’ అనే అన్యాయ వ్యవస్థకు స్వస్తి పలుకుతామన్నారు. అసలైన సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి కచ్చితమైన గ్యారెంటీ ఇస్తున్నట్లు తెలిపారు.

ఓట్ల చోరీపై సంతకాల ఉద్యమం షురూ

ఓట్ల చోరీపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా సంతకాల ఉద్యమం ప్రారంభించింది. అక్టోబరు 15వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. 5 కోట్ల సంతకాలు సేకరించాలని సంకల్పించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 06:26 AM