Political Interaction: ఇండియా కూటమితో భేటీకి ఈసీ అంగీకారం..
ABN , Publish Date - Aug 11 , 2025 | 09:47 AM
Political Interaction: సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు 300 మందికి పైగా ఎంపీలు ర్యాలీ చేయబోతున్నారు. అయితే, ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు పర్మీషన్ ఇవ్వలేదు.
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరిగా లేదని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు 300 మందికి పైగా ఎంపీలు ర్యాలీ చేయబోతున్నారు. అయితే, ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ర్యాలీ నిర్వహణకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక వినతి అందలేదని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు.
ఇండియా కూటమి మాత్రం ర్యాలీ నిర్వహించి తీరాలని డిసైడ్ అయింది. ఇలాంటి సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీ నేతలతో భేటీకి ఎన్నికల సంఘం అంగీకరించింది. నిన్న(ఆదివారం) కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు జైరాం రమేష్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భేటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. జైరాం రమేష్ లేఖపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జైరాం రమేష్‌కు ఎన్నికల సంఘం సెక్రటరీ అశ్వినీ కుమార్ మోహల్ ఆదివారం రాత్రి లేఖ రాశారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఎక్కువ మంది పట్టే అవకాశం లేనందున కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. సుకుమార్ సెన్ హాల్‌లో సమావేశం జరగనుంది. అయితే, ఎన్నికల సంఘం భేటీకి అంగీకరించిన నేపథ్యంలో ర్యాలీపై ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా, 2024 ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో దాదాపు 1,00,250 ఓట్లు చోరీ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. జలాశయాలకు భారీగా వరద నీరు
టర్కీని వణికించిన భూకంపం.. పలు భవనాలు నేలమట్టం..