DRDO Successfully Tests Agni Prime Missile: రైలు పైనుంచి క్షిపణి
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:11 AM
భారత రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. తొలిసారి రైలుపై నుంచి ప్రయోగించదగిన మధ్యశ్రేణి అగ్ని-ప్రైమ్ క్షిపణి పరీక్షను డీఆర్‌డీవో గురువారం విజయవంతంగా...
అగ్ని-ప్రైమ్ పరీక్ష సక్సెస్
తొలిసారిగా రైలుపై నుంచి పరీక్షించిన డీఆర్డీవో
2 వేల కి.మీ.ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే సామర్థ్యం
రైల్ నెట్‌వర్క్‌తో దేశంలో ఎక్కడికైనా తరలించే చాన్స్
అల్వాల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారత రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. తొలిసారి రైలుపై నుంచి ప్రయోగించదగిన మధ్యశ్రేణి అగ్ని-ప్రైమ్ క్షిపణి పరీక్షను డీఆర్‌డీవో గురువారం విజయవంతంగా నిర్వహించింది. రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించిన ప్రత్యేక మొబైల్ లాంచింగ్ వ్యవస్థపై నుంచి ఇలాంటి ప్రయో గం చేయడం ఇదే మొదటిసారి. ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో వెల్లడించారు. అణుసామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకి తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను డీఆర్‌డీవో అభివృద్ధి చేసినట్టు ఆయన తెలిపారు. ఈ క్షిపణి పరీక్షను విజయవంతం చేసిన డీఆర్‌డీవో, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్‌ఎ్‌ఫసీ), సాయుధ దళాలను ఆయన అభినందించారు. ఈ పరీక్షను విజయవంతం చేసిన బృందాలను డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ అభినందించారు.
అగ్ని ప్రైమ్ అగ్ని-5
అగ్ని ప్రైమ్ మిస్సైల్‌లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఇది 2 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించగలదు. శత్రు రాడార్ల కళ్లుగప్పి వారి స్థావరాలపై కచ్చితమైన దాడులు చేయగలదు. రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే దేశంలోని ఏ సరిహద్దు ప్రాంతానికైనా వేగంగా తరలించవచ్చు. దీనిలోని నావిగేషన్ వ్యవస్థను ఆధునీకరించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత్ వద్ద ఉన్న అగ్ని-5 క్షిపణిపైనా చర్చ మొదలైంది. అగ్ని-ప్రైమ్ కూడా ‘అగ్ని’ శ్రేణికే చెందినప్పటికీ.. అగ్ని-5తో దీనికి పోలికలేదు. ఇవి రెండూ వేర్వేరు ప్రయోజనాల కోసం రూపొందించిన క్షిపణులు. అగ్ని ప్రైమ్.. నెక్ట్స్ జనరేషన్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అణు సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని రైలు, లేదా రోడ్డు ఆధారిత మొబైల్ లాంచర్లపై నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీనిలో సింగిల్ వార్‌హెడ్ ఉంటుంది. ఇక భారత్ వద్ద ఉన్న అత్యంత దీర్ఘశ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5. అణుసామర్థ్యం కలిగిన ఈ మిస్సైల్ 5వేల కిలోమీటర్లకంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. ఇది మూడు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. అవి ఒక్కొక్కటీ వేర్వేరు లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఛేదిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News