Direct Benefit Transfer: డీబీటీ నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి రూ. 4.31 లక్షల కోట్లు ఆదా: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:55 PM
డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నందున ప్రభుత్వానికి 4 లక్షల 31 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్‌లో ఆమె GIFT..
ముంబై, అక్టోబర్ 7: వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తాల్ని ఆయా లబ్దిదారులకు నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్న విషయం విదితమే. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి అక్షరాలా నాలుగు లక్షల 31 వేల కోట్ల రూపాయలు ఆదా అయిందని మీకు తెలుసా. ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ కార్యక్రమం పాల్గొన్న కేంద్రమంత్రి ఈరోజు విదేశీ కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్(GIFT)ను కూడా ప్రారంభించారు. ఈ ఆధునిక వ్యవస్థ విదేశీ కరెన్సీ లావాదేవీలను రియల్-టైమ్(తక్షణమే) ప్రాతిపదికన పూర్తి చేస్తుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం, ముంబైలో విదేశీ కరెన్సీని సెటిల్ చేయడానికి 36 నుండి 54 గంటలు పడుతుందని.. ఇవాళ ప్రారంభించిన గిఫ్ట్ సెటిల్ మెంట్ వ్యవస్థ(Global Financial Infrastructure for Foreign Currency Settlement System)తో ఈ సమయం చాలా ఆదా అవుతుందని కేంద్రమంత్రి తెలిపారు. ఫలితంగా భారత్ ఇప్పుడు, హాంకాంగ్, టోక్యో, మనీలా సరసన చేరిందని మంత్రి తెలిపారు.
దేశంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫిన్‌టెక్, ఆధార్, UPI, డిజిలాకర్ వ్యవస్థల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎలా ముందుకెళ్తున్నామన్న విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోని అన్ని వ్యవస్థలు టెక్నాలజీ వారధిగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. గోప్యతను కాపాడుతూ, ప్రతి పౌరుడిని ఉద్ధరించేలా, టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందాలని ఆమె సూచించారు. తద్వారా దేశం మరింత త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
GIFT సిస్టమ్ అంటే ఏమిటి?
ఇప్పటి వరకూ భారత్‌లో ఉన్న బ్యాంకులు లేదా కంపెనీలు అమెరికా డాలర్లు, యూరోలు, యెన్ వంటి విదేశీ కరెన్సీల్లో లావాదేవీలు చేయాలంటే, అవి ఇప్పటివరకు హాంకాంగ్, టోక్యో లేదా లండన్ బ్యాంకుల ద్వారా సెటిల్ చేసేవి. ఈ ప్రక్రియకు 36 నుండి 54 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు, GIFT System ద్వారా భారత్‌లోనే ఈ లావాదేవీలను రియల్ టైమ్‌లో (తక్షణమే) పూర్తి చేయొచ్చు.
దీని ప్రయోజనాలు:
గిఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా భారత్ ఇప్పుడు హాంకాంగ్, టోక్యో, మనీలా సరసన నిలిచింది.
విదేశీ కరెన్సీ సెటిల్‌మెంట్స్‌లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయి.
బ్యాంకులు, కంపెనీలు, ఇన్వెస్టర్లకు తక్కువ సమయంలో సులభమైన లావాదేవీలు జరిగే వీలు.
భారత్ అంతర్జాతీయ ఫైనాన్షియల్ హబ్‌గా ఎదగడంలో ఇది కీలకం.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి