Woman Attacks Sleeping Husband: గురకపెట్టి నిద్రపోతున్న భర్త.. భార్య చేసిన పనికి చావు బతుకుల్లో..
ABN , Publish Date - Oct 09 , 2025 | 07:25 AM
అక్టోబర్ 2వ తేదీన దినేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. శరీరం మండుతున్నట్లు అనిపించటంతో ఠక్కున కళ్లు తెరిచాడు. పక్కన భార్య నిలబడి ఉంది. వేడివేడి నూనె అతడి శరీరంపై పోస్తూ ఉంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్త ప్రాణాలు తీయడానికి పూనుకుంది. గురకపెట్టి నిద్రపోతున్న భర్తపై వేడి వేడి నూనె పోసింది. ఈ అమానుషమైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మదన్‌గిరికి చెందిన దినేష్‌కు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. దినేష్ జంటకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. పెళ్లయిన ఏడాదినుంచే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరటంతో రెండేళ్ల క్రితం ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రోజురోజుకు భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 2వ తేదీన దినేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. శరీరం మండుతున్నట్లు అనిపించటంతో ఠక్కున కళ్లు తెరిచాడు. పక్కన భార్య నిలబడి ఉంది. వేడివేడి నూనె అతడి శరీరంపై పోస్తూ ఉంది. అతడు లేవడానికి ప్రయత్నించగా మీద కారం పొడి చల్లింది. దీంతో అతడు అల్లాడిపోయాడు. నొప్పి భరించలేక గట్టిగా అరవసాగాడు. ‘నువ్వు అరిచావంటే ఇంకా వేడి నూనె మీద పోస్తాను’ అని బెదిరించింది. భరించలేని నొప్పితో అతడు మాత్రం గట్టిగా అరుస్తూనే ఉన్నాడు.
ఆ అరుపులు విన్న ఇంటి ఓనర్, అతడి కూతురు పరుగున దినేష్ ఉండే ప్లాట్ దగ్గరకు వెళ్లారు. తలుపు లోపలినుంచి గడియపెట్టి ఉంది. తలుపు తెరవమని ఇంటి ఓనర్ అన్నాడు. కొద్దిసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. దినేష్ నొప్పితో విలవిల్లాడుతున్నాడు. అతడి భార్య లోపల దాక్కుంది. ఇంటి ఓనర్ దినేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నించగా దినేష్ భార్య అడ్డుకుంది. తనే తీసుకెళతానని చెప్పింది. భర్తను తీసుకుని ఇంటి బయటకు వచ్చింది. ఆస్పత్రి ఉన్న వైపు కాకుండా వేరే వైపు అతడ్ని తీసుకెళ్లసాగింది.
దీంతో అనుమానం వచ్చిన ఇంటి ఓనర్ ఆమెను ఆపాడు. ఆటోలో దినేష్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తీవ్రగాయాలు అవ్వటంతో అక్కడి వైద్యులు సఫ్‌దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. దినేష్ ప్రస్తుతం సఫ్‌దర్‌జంగ్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దినేష్ భార్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మొదటి దశ శాంతి ఒప్పందం.. సంతకం చేసిన ఇజ్రాయెల్, హమాస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..