Share News

Delhi Elections 2025: అప్పుడిలా.. ఇప్పుడిలా.. ఐదేళ్లలో ఎంత మార్పు..?

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:37 PM

దేశ రాజధాని ఢిల్లీ పీఠం మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీ వాసులు మాత్రం కేజ్రీవాల్‌నే నమ్మారు. దాదాపు 26 ఏళ్లుగా బీజేపీకి ఢిల్లీ పీఠం దూరంగానే ఉండిపోయింది.

Delhi Elections 2025: అప్పుడిలా.. ఇప్పుడిలా.. ఐదేళ్లలో ఎంత మార్పు..?
Delhi Election result

బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ అధికార పీఠాలను కైవసం చేసుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కూడా విజయాలు సాధిస్తోంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ పీఠం మాత్రం బీజేపీ (BJP)కి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీ వాసులు మాత్రం కేజ్రీవాల్‌నే నమ్మారు. దాదాపు 26 ఏళ్లుగా బీజేపీకి ఢిల్లీ పీఠం దూరంగానే ఉండిపోయింది (Delhi Elections 2025).


గత ఎన్నికలు జరిగిన 2020లో కూడా బీజేపీ పెద్దలు చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఢిల్లీని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో స్పష్టమైన విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంది. 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి ఏకంగా 62 స్థానాలు లభించాయి. బీజేపీ మాత్రం కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఐదేళ్లు తిరిగే సరికి పరిస్థితి మారిపోయింది. మద్యం కేసులో కేజ్రివాల్, అతడి పార్టీ నేతలు ఇరుక్కోవడం, ఢిల్లీ కాలుష్యం, యమునా నదిని క్లీన్ చేసే విషయంలో మాట నిలబెట్టుకోలేకపోవడం ఆప్ పాలిట శాపాలుగా మారాయి.


పార్టీలోని కీలక నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీలో లుకలుకలు, సీఎం కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. దీంతో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. బీజేపీ పెద్దలు ఢిల్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. అనుకున్నట్టుగా అద్భుత విజయం సాధించారు. గత ఎన్నికల్లో 62 స్థానాలు సాధించిన ఆప్ తాజా ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ తాజా ఎన్నికల్లో 47 స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్ ఎప్పటిలాగానే ఒక్క సీటూ గెలవకుండా ఉండిపోయింది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:37 PM