Birthday Gift Dispute: బర్త్‌డే గిఫ్ట్స్ విషయంలో గొడవ.. అత్తా, భార్యను చంపేసిన యోగేష్
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:38 PM
హిమాలయ మధ్యాహ్నం ప్రియ ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తాళానికి రక్తపు మరకలు ఉన్నాయి. అతడికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఢిల్లీ: బర్త్‌డే గిఫ్ట్స్ విషయంలో గొడవ రెండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ వ్యక్తి తన అత్తా, భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రోహిణి ప్రాంతానికి చెందిన ప్రియ సెహగల్, యోగేష్ భార్యభర్తలు. ఆగస్టు 28వ తేదీ రాత్రి వీరి కొడుకు చిరాగ్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో ప్రియ తల్లి కుసుమ్‌తోపాటు మరికొంతమంది కూడా పాల్గొన్నారు. కానుకల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది.
దీంతో ప్రియ తల్లి రాత్రికి అక్కడే ఉండిపోయింది. ఇద్దరికీ సర్థిచెప్పాలని అనుకుంది. అదే ఆమె పాలిట యమపాశంలా మారింది. రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేష్ పదునైన ఆయుధంతో భార్య, అత్తపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా వారిని పొడిచేశాడు. ఈ దాడిలో ఇద్దరూ చనిపోయారు. యోగేష్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆగస్టు 30వ తేదీ ఉదయం ప్రియ సోదరుడు హిమాలయ తల్లి కుసుమ్ ఫోన్‌కు కాల్ చేశాడు. అటునుంచి స్పందన రాలేదు. ఎన్నిసార్లు చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు.
దీంతో మధ్యాహ్నం ప్రియ ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తాళానికి రక్తపు మరకలు ఉన్నాయి. అతడికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడి చేరుకుని తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల ప్రియ, కుసుమ్ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు యోగేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రియ, యోగేష్‌కు పెళ్లై 17 ఏళ్లు అవుతోంది. అయినా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా తరచుగా గొడవలు పడుతూ ఉండేవారని తేలింది.
ఇవి కూడా చదవండి
బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఉదయాన్నే ఈ పనులు చేయకపోతే జీవితంలో సక్సెస్ కాలేరు..