Delhi Politics: ఢిల్లీలో ఫులేరా సర్కారు
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:59 AM
అధికారిక కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తాతో పాటు ఆమె భర్త కూడా పాల్గొనడం రాజకీయ దుమారానికి దారి తీసింది...
అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు?
మనీశ్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు?.. బీజేపీ సమాధానం చెప్పాలి
పంచాయత్ వెబ్ సిరీస్‌లోని ఫులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆప్ విమర్శలు
సీఎం భర్తగా కాదు.. సామాజిక కార్యకర్తగా వచ్చారు: బీజేపీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: అధికారిక కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తాతో పాటు ఆమె భర్త కూడా పాల్గొనడం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఆదివారం ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులతో పాటు ఆమె భర్త మనీష్ గుప్తా కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం రేఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు, ఫొటోలను సీఎంవో ఎక్స్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో పసుపుపచ్చ రంగు చొక్కా ధరించిన మనీష్ గుప్తా, తన భార్య రేఖ పక్క కుర్చీలో కూర్చొని ఉన్నారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు కూర్చున్నారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తిని అధికారిక సమావేశాల్లో కూర్చోబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఢిల్లీలో ‘ఫులేరా’ తరహా ప్రభుత్వం నడుస్తోందా? అని ప్రశ్నించారు. పంచాయత్ అనే వెబ్ సిరీస్‌లో ‘ఫులేరా’ గ్రామానికి సర్పంచ్ మహిళ కాగా.. అక్కడ ఆమె భర్త పెత్తనం చెలాయిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆప్ నేత ‘ఫులేరా’ సర్కారు అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘ఢిల్లీలో ‘ఫులేరా’ ప్రభుత్వం నడుస్తోందా? కుటుంబ పాలనపై కాంగ్రె్‌సను విమర్శించే బీజేపీ.. దీనికి సమాధానం చెప్పాలి. ఇది కుటుంబ పాలన కాదా?’’ అని సౌరభ్ భరధ్వాజ్ ఎక్స్‌లో ప్రశ్నించారు. ఆప్ మరో నేత సంజయ్ సింగ్.. ‘‘ప్రధాని మోదీ ఢిల్లీకి ఇద్దరు సీఎంలను నియమించారు’’ అని విమర్శలు గుప్పించారు. అయితే, అధికారిక సమావేశంలో మనీష్ కూర్చోవడాన్ని బీజేపీ సమర్థించుకుంది. అందులో తప్పేమీ లేదంది. ‘‘మనీష్ కేవలం సీఎం రేఖ భర్త మాత్రమే కాదు. ఆయనో సామాజిక కార్యకర్త. షాలిమార్‌బాగ్ నియోజకవర్గంలో జరిగే పనులను పర్యవేక్షిస్తుంటారు. స్థానిక ప్రజల ప్రతినిధిగా ఉన్నారు. ఆ హోదాలోనే ఆయన సమావేశంలో కూర్చున్నారు. ఆ సమావేశంలో కొందరు స్థానికులు కూడా ఉన్నారు’’ అని ఢిల్లీ బీజేపీ నేత హరీశ్ ఖురానా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News