CM Omar Abdullah: కశ్మీరీలు అందరినీ ఒకే గాటన కట్టొద్దు: ఒమర్ అబ్దుల్లా
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:09 PM
ఢిల్లీ పేలుడు ఘటనను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అయితే, కశ్మీరీలు అందరినీ అనుమానితులుగా చూడొద్దని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుడు ఘటనను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అయితే, అందరు కశ్మీరీలనూ అనుమానితులుగా చూడొద్దని కూడా అన్నారు. డిల్లీ దాడి క్షమించరానిదని వ్యాఖ్యానించారు. నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. కొద్ది మంది చేసిన పనికి యావత్ కశ్మీరీ ప్రజానీకాన్ని బాధ్యులుగా చేయొద్దని కోరారు ( CM Omar Abdullah)
‘ఈ దాడిని ఖండించేందుకు ఎన్నిమాటలు అయినా చాలవు. అమాయకులపై హింసకు పాల్పడటాన్ని ఏ మతం కూడా సమర్థించదు. ఈ దాడి చేసిన వారు రాజకీయాలను, విశ్వాసాలను సరిగా అర్థం చేసుకోలేదు’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు (Delhi Blast Case)
కశ్మీర్ జనాలు మొత్తం అతివాదం వైపు మళ్లలేదని కూడా ఆయన చెప్పారు. అక్కడి వారు అందరూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరని అన్నారు. అందరినీ ఒకేగాటన కట్టకూడదని అన్నారు. ఇలాంటి దాడి జరిగిన ప్రతిసారీ కశ్మీరీలు తమ దేశభక్తిని ఎందుకు రుజువు చేసుకోవాలని ప్రశ్నించారు. తామందరినీ అనుమానితులుగా చూడటం మానుకోవాలని అన్నారు.
భద్రతాలోపాలపై కూడా సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఉగ్ర లింకులు ఉన్న ఓ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు తరువాత ప్రభుత్వం మరింత లోతైన దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వారిని ఉద్యోగంలోకి చేర్చుకున్న సంస్థలు లోతైన బ్యాక్ గ్రౌండ్ చెక్స్ ఎందుకు చేయలేదని అన్నారు. ఉగ్రవాదానికి సంబంధం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉంటే కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఢిల్లీ దాడిపై తనకు ప్రత్యేక సమాచారం ఏదీ అందలేదని, మీడియా ద్వారా అందిన సమాచారంపై ఆధారపడ్డానని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో పాలన వ్యవస్థే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటన వెనుక కశ్మీరీకు చెందిన కొందరు డాక్టర్ల నెట్‌వర్క్ ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
గ్రెనేడ్ దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి