Turkiye handler directed: ఢిల్లీ ఘటనకు 'ఉకాసా' సూత్రధారా.?
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:31 PM
ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక సూత్రధారి ఎవరో అధికారుల దర్యాప్తులో తేలింది. తుర్కియే నుంచి ఓ వ్యక్తి ఇక్కడున్న వారికి మార్గనిర్దేశం చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన బాంబు పేలుడు ఘటనలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు తుర్కియేకు చెందిన 'ఉకాసా(Ukasa)'గా పిలువబడే వ్యక్తి కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టు దర్యాప్తులో తేలింది. అతడు అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ(Al-Falah University) ప్రొఫెసర్ ఉమర్-ఉన్-నబీ(Umar) నేతృత్వంలోని ఉగ్ర మాడ్యూల్‌కు మార్గనిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం.. ఢిల్లీ మాడ్యూల్ సహా నిషేధిత సంస్థలైన జైష్-ఎ-మహమ్మద్(JeM), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్(AGuH) నిర్వాహకుల మధ్య ఉకాసా కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. 2022లోనే వీరు తుర్కియేలో ఈ కుట్రపన్నారని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఉమర్ సహా మరో ముగ్గురు.. పాక్ మద్దతు ఉన్న రెండు గ్రూపులతో కలిసి పనిచేశారు. ఉమర్.. అదే ఏడాది మార్చిలో తుర్కియేను సందర్శించి, రెండు వారాలపాటు అక్కడే అంకారాలో బసచేశాడు. తొలుత వీరంతా టెలిగ్రామ్‌లో సంభాషించుకున్నాక.. తర్వాత ఇతర ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లకు మారారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారికి రహస్య స్థావరాలను ఎలా ఏర్పరచుకోవాలో, డిజిటల్ ఫుట్‌ప్రింట్‌లను ఎలా నివారించాలో మార్గనిర్దేశం చేశారు ఉకాసా. ఇలా భారత్‌లో నిర్వహించే దాడులపై ప్రణాళికలను రూపొందించడంలో ఉకాసా కీ రోల్ ప్లే చేసినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఆపరేషన్ కోసం వీరు.. హ్యుండాయ్ ఐ20(Hundai I20), ఎరుపురంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్(Maruti Ecosport), మారుతీ బ్రెజా(Maruti Brezza) వంటి మూడు కార్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉమర్ ఐ20 కారు పేలిపోయి చనిపోగా.. ఫరీదాబాద్ నుంచి ఎకోస్పోర్ట్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మూడో కారు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. మిగిలిన వాహనాల్లో ఇంకా పేలుడు పదార్థాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
టార్గెట్ లిస్ట్‌లో అయోధ్య.!
ఉమర్ స్నేహితుడు, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో అనుబంధం కలిగిన డా.ముజామ్మిల్.. ఈ ఏడాది జనవరిలో ఎర్రకోట ప్రాంతంలో అనేకసార్లు రెక్కీ నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీరి ద్వారా 2022 నుంచి అమ్మోనియం నైట్రేట్, RDX సంబంధిత 350 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను సేకరించినట్టు పేర్కొంది.
ఉగ్రవాదుల లిస్ట్‌లో ఢిల్లీతో పాటు అయోధ్య కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. నవంబర్ 25న అక్కడ దాడికి ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఉకాసా గుట్టు విప్పేందుకు..
ఇలా ఢిల్లీ పేలుళ్లకు కీలక సూత్రధారిగా భావిస్తున్న 'ఉకాసా' జాడను గుర్తించేందుకు, పాక్ ఉగ్రవాద సంస్థలతో అతడికున్న సంబంధాలను వెలికితీసే దిశగా దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం విదేశీ నిఘా సంస్థల అండతో కలిసి ముందడుగు వేయనున్నారు. తుర్కియే కనెక్షన్ ఈ కేసుకు మూలంగా భావిస్తున్న తరుణంలో ప్రతి ఎన్‌క్రిప్టెడ్ చాట్, విదేశీ ట్రాన్స్‌ఫర్లను పరిశీలిస్తున్నారు అధికారులు.