Delhi Car Blast Case: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:35 AM
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. వారినుంచి వివరాలు సేకరిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాండ్వాలిలో కారు పార్క్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును పార్క్ చేసిన వ్యక్తిని ఫహీమ్‌గా గుర్తించారు. బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడైన డాక్టర్ ఉమర్‌కు ఫహీమ్ బంధువుగా తెలుస్తోంది. ఇక ఇదే కేసులో డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తిని దర్యాప్తు బృందాలు కాన్పూర్‌లో అదుపులోకి తీసుకున్నాయి. డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ డాక్టర్ షాహినాతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ఇంట్లో సోదాలు..
ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. బుధవారం తెల్లవారు జామున రాజేంద్రనగర్‌లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు సభ్యుల స్పెషల్ ఏటీఎస్ బృందం సోదాలు చేసింది. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో గంటన్నరకుపైగా సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా గుర్తుతెలియని రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటరు, పుస్తకాలు, పేపర్లను ఏటీఎస్ బృందం స్వాధీనం చేసుకుంది.
డీఎన్ఏ మ్యాచ్
ఢిల్లీ ఎర్ర కోట దగ్గర జరిగిన బాంబు దాడిలో ధ్వంసం అయిన కారు ఆక్సిలరేటర్, స్టీరింగ్ మధ్యలో తెగిపడిన ఓ కాలును అధికారులు గుర్తించారు. దాని నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించారు. ఆ శాంపిల్స్‌ను ఉమర్ తల్లి డీఎన్ఏ శాంపిల్స్‌తో మ్యాచ్ చేశారు. ఈ రెండూ మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి అధికారిక నివేదిక రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
పిల్లలతో రైళ్లో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే...
మరో రెండు అల్పపీడనాలు.. భారీవర్ష సూచన