Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఓట్లు తొలగిస్తారని మీకు తెలుసా.. ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:05 PM
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో ఒకప్పుడు ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించేవారు. అయితే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో ఈవీఎం విధానాన్ని తీసుకువచ్చారు. దీన్ని చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ బ్యాలెట్ విధానాన్నే తీసుకురావాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరనే విషయం మరికొన్ని గంటల్లో(ఫిబ్రవరి 8న) తెలయనుంది. ఈసారి అన్నీ ఎగ్జిజ్ పోల్స్ కూడా బీజేపీ వైపే మెుగ్గు చూపుతున్నాయి. 27 సంవత్సరాల తర్వాత కాషాయ పార్టీ దేశరాజధానిలో జెండా ఎగరవేయనున్నట్లు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అయితే రేపు(శనివారం) ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులు కొన్ని ఓట్లను లెక్కించకుండానే తీసేస్తారని మీకు తెలుసా. అలా ఎందుకు చేస్తారో, దాని వెనక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో ఒకప్పుడు ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించేవారు. అయితే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో ఈవీఎం విధానాన్ని తీసుకువచ్చారు. దీన్ని చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ బ్యాలెట్ విధానాన్నే తీసుకురావాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఈవీఎం మిషన్ ద్వారానే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సులభంగా ఓటు వేయడం, లెక్కించడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం.
ఓట్లు ఎందుకు తొలగిస్తారంటే..
ఓటింగ్ రోజున ఎన్నికల అధికారులు తెల్లవారుజాము సమయానికే ఆయా ఎన్నికల కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈవీఎం మిషన్లు సరిగ్గా పని చేస్తున్నాయా, లేదా? అనే విషయాన్ని ఓటింగ్‌కు ముందుగానే అధికారులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈవీఎం మిషన్‌పై ఉన్న వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఎదుట ఉన్న బటన్‌పై నొక్కి వారికి ఓట్లు వేస్తారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ మిషన్లు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా? అనే విషయాన్ని తనిఖీ చేసి మరీ చూస్తారు. వేసిన అభ్యర్థికే ఓటు పడుతోందా, లేదా? అనే అంశాన్నీ పరిశీలిస్తారు. ఈ సందర్భంగా ఆయా అభ్యర్థులకు అధికారులు వేసిన ఓట్లు ఈవీఎం మిషన్లలోనే ఉండిపోతాయి. అయితే వాటిని తీసేందుకు మాత్రం వారికి అవకాశం ఉండదు.
అలాంటప్పుడు ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఫారం 17C ని బూత్ అధికారులకు అందజేస్తుంది. అందులో ఓటింగ్ రోజున ఎన్నికలకు సంబంధించిన సమాచారంతోపాటు తనిఖీ సందర్భంగా ఏఏ అభ్యర్థులకు ఎన్నెన్ని ఓట్లు వేశారో కూడా అధికారులు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకుని అధికారులు వేసిన ఓట్లను కౌంటింగ్ రోజున తొలగిస్తారు. దీని వల్ల నిజమైన ఓటర్లు వేసిన ఓట్లు మాత్రమే లెక్కించి గెలుపొందిన వారిని ప్రకటించే అవకాశం దొరుకుతుంది. ఒక్క ఓటు కూడా అభ్యర్థుల గెలుపు, ఓటములు నిర్ణయించిన సందర్భాలు ఎన్నో ఉన్న నేపథ్యంలో వీటిని తొలగించడం అనేది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
గెలుపు ఎవరిది అంటే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 51, ఆమ్ ఆద్మీకి 19 సీట్లు లభిస్తాయని టు డేస్ చాణక్య అంచనా వేసింది. బీజేపీకి 45 నుంచి 55 సీట్లు, ఆమ్ ఆద్మీకి 15 నుంచి 20 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. పీపుల్స్ పల్స్ బీజేపీకి 51 నుంచి 60, ఆప్‌కు 10 నుంచి 19 సీట్లు వస్తాయని చెప్పింది. అయితే మెుత్తం 70 సీట్లలో బీజేపీనే ఎక్కువ గెలిచే అవకాశం ఉందని ఆయా సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రేసులో ఎక్కడా కనిపించడం లేదని వెల్లడించాయి.