Share News

Foreign Students: అమెరికా కాలేజీలు కుదేలు!

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:15 AM

విదేశీ విద్యార్థులు లేక అమెరికాలోని కళాశాలలు బోసిపోతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే ఎఫ్‌-1 వీసా అనుమతులను నిలిపివేయడం లేదా తీవ్ర ఆలస్యం చేయడంతో విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

Foreign Students: అమెరికా కాలేజీలు కుదేలు!

  • ఎఫ్‌-1 వీసాల అనుమతులు 22 శాతం మేరకు నిలిపివేత

  • విదేశీ విద్యార్థుల రాకకు బ్రేక్‌

  • రూ.61 వేల కోట్ల రాబడికి గండి ట్రంప్‌ విధానాలతో తీవ్ర నష్టం

న్యూఢిల్లీ, ఆగస్టు 31: విదేశీ విద్యార్థులు లేక అమెరికాలోని కళాశాలలు బోసిపోతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే ఎఫ్‌-1 వీసా అనుమతులను నిలిపివేయడం లేదా తీవ్ర ఆలస్యం చేయడంతో విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య 12ు మేరకు తగ్గిన ఎఫ్‌-1 వీసాల అనుమతి.. మే నాటికి 22 శాతానికి చేరింది. జూన్‌ వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే.. జూన్‌ నాటికి ఎఫ్‌-1 వీసాల అనుమతులు 90 శాతానికి తగ్గిపోయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక, విదేశీ విద్యార్థుల రాక ఆగిపోవడంతో రూ.61,703 కోట్ల పైచిలుకు రాబడి నిలిచిపోయినట్టు తెలిపారు. అదేసమయంలో స్థానికంగా కాలేజీ ద్వారా లభించే ఉపాధి, ఉద్యోగాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. స్థానికులు ఇప్పటికే 60 వేల పైచిలుకు ఉద్యోగాలు నష్టపోయారని వివరించారు. ఇక, కాలేజీలు కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాల బాటపడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా కాలేజీలు తమ ప్రణాళికలు, బడ్జెట్‌ను కూడా పునఃసమీక్షించుకునే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు తెలిపారు. వాస్తవానికి అమెరికా విద్యాసంస్థల ఆదాయంలో భారత విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకువచ్చిన విధానాల కారణంగా.. ఎఫ్‌-1 వీసాల అనుమతులకు బ్రేక్‌ పడడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కాగా, ఈ పరిణామం.. భారత్‌-అమెరికా దేశాల మధ్య భవిష్యత్తుల సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది.


దెబ్బ పడింది!

ఎఫ్‌-1 వీసాలపై విధించిన ఆంక్షలతో పలు విద్యాసంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ మిస్సోరి దీనికి ఓ ఉదాహరణ. ఈ విద్యాసంస్థ అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడింది. కానీ, ఈ ఏడాది ప్రవేశాలు సగానికిపైగా తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బడ్జెట్‌ కుదించుకోవడంతోపాటు, సిబ్బంది వేతనాల్లోనూ కోత పెట్టింది. ఇలా దాదాపు 100కు పైగా అమెరికాలోని కాలేజీలు ఇబ్బందులు పడుతున్నాయి.

దీర్ఘకాలిక ప్రభావం

విదేశీ విద్యార్థులు తగ్గుముఖం పట్టడం భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలు సహా విద్యారంగంలో పోటీతత్వంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ పేర్కొంది. విదేశీ విద్యార్థులు లేకపోతే.. ఆదాయానికి, ఖర్చులకు మధ్య ఊహించని విధంగా లోటు ఏర్పడుతుందని వివరించింది. అంతేకాదు, విదేశీ విద్యార్థులు చెల్లిస్తున్న ట్యూషన్‌ ఫీజుల నుంచే అమెరికా విద్యార్థులకు స్కాలర్‌ షిప్పులు ఇస్తున్నామని, భవిష్యత్తులో ఇది కూడా ప్రభావితం అవుతుందని జార్జ్‌ మాసన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ జస్టిన్‌ తెలిపారు. భారతవిద్యార్థుల ప్రవేశాలపై అమెరికా, కెనడా విధించిన ఆంక్షల కారణంగా విదేశీ విద్యపై చేస్తున్న ఖర్చు ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.


వీసాలు స్వయంగా తీసుకోవాల్సిందే!

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న భారత పౌరులు.. తమ వీసాలను స్వయంగా దౌత్య కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. వీసా తీసుకునేందుకు మూడో వ్యక్తిని కానీ, కుటుంబ సభ్యులను కానీ అనుమతించడం లేదని పేర్కొంది. భద్రతా పరమైన చర్యల్లో భాగంగా కొత్త నిబంధనను అమలు చేస్తున్నట్టు వివరించింది. ఒకవేళ ఎవరైనా స్వయంగా వచ్చి తీసుకునే అవకాశం లేకపోతే.. హోం డెలివరీ సదుపాయం ఉందని, రూ.1200 అదనంగా చెల్లించాలని, ఆన్‌లైన్‌లోనే దీనికి ఆప్షన్‌ పెట్టుకోవాలని సూచించింది.

Updated Date - Sep 01 , 2025 | 05:15 AM