Share News

బుల్లెట్‌ నడిపాడని చేతులు నరికారు

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:31 AM

ఓ దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్‌ బండి నడపడమే తప్పిదమైపోయింది! ‘జాతి తక్కువవాడివి!! మా ముందు బండి నడపడమేంట’ంటూ కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ యువకుడి రెండు చేతులూ నరికేశారు.

బుల్లెట్‌ నడిపాడని చేతులు నరికారు

  • తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాల

  • దాష్టీకం.. బాధితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన

  • రెండు చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులు

చెన్నై, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఓ దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్‌ బండి నడపడమే తప్పిదమైపోయింది! ‘జాతి తక్కువవాడివి!! మా ముందు బండి నడపడమేంట’ంటూ కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ యువకుడి రెండు చేతులూ నరికేశారు. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేశారు. శివగంగ జిల్లా మేల్‌పిడవూరు గ్రామానికి చెందిన దళితవర్గానికి చెందిన అయ్యాసామి, శివగంగలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల అతడు తనకిష్టమైన బుల్లెట్‌ బండి కొన్నాడు.


రోజూ దానిపై కాలేజీకి వెళ్తుండడం పట్ల గ్రామంలోని కొందరు అగ్రవర్ణాలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అయ్యాసామి బుధవారం కళాశాలకు బుల్లెట్‌పై వెళ్తుండగా అతడిని ముగ్గురు అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారు. ‘కులం తక్కువోడివి..! నువ్వు మా ముందే బండెక్కుతావా?.. నీకు బుల్లెట్‌ కావాల్సివచ్చిందా?’ అంటూ దాడి చేశారు. కత్తులతో ఆ యువకుడి రెండు చేతులూ నరికేశారు. చుట్టుపక్కల వారు అయ్యాస్వామిని మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. అతడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. అయ్యాసామి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో దాడిచేసిన దుండగులు అతడి ఇంట్లోకి వెళ్లి వస్తువులను ధ్వంసం చేశారు.

Updated Date - Feb 14 , 2025 | 05:31 AM