Share News

Evaluation Flaws: సీయూఈటీ యూజీ లోపభూయిష్ఠం

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:21 AM

దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష సీయూఈటీ యూజీ వ్యవస్థ లోపభూయిష్ఠంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి.

Evaluation Flaws: సీయూఈటీ యూజీ లోపభూయిష్ఠం

పరీక్ష పత్రం సరళిపై ఆందోళనలు

న్యూఢిల్లీ, జూలై 5: దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ) వ్యవస్థ లోపభూయిష్ఠంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి. ఈ నెల 4న సీయూఈటీ-యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పరీక్ష పత్రం సరళి, మూల్యాంకనంలో తప్పులు, ఒక స్ట్రీమ్‌ నుంచి మరోదానిలోకి మారడంలో అడ్డంకులు, సహేతుకంగా లేని నార్మలైజేషన్‌ ప్రక్రియ తదితరాలపై విద్యార్థులు, నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. స్కోరింగ్‌ విధానం, వ్యవస్థాగత వైఫల్యాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎకనామిక్స్‌ (ఆనర్స్‌), బీఎంఎస్‌ వంటి కోర్సుల్లోకి మారాలని భావించే సైన్స్‌ విద్యార్థులను సీయూఈటీ-యూజీ 2025 స్వరూపం తీవ్ర ఒత్తిడికి గురిచేసింది.


ప్రశ్నపత్రం సరళి సబ్జెక్టు మారడాన్ని కఠినతరంగా మార్చింది. తమ కోర్‌ సబ్జెకులు మినహా మిగిలిన వాటిలో రాణించాల్సి రావడం వారికి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఇక ఐదు సబ్జెక్టులే ఎంచుకోవాలన్న నిబంధన విద్యార్థులకున్న ఆప్షన్లను పరిమితం చేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత విధానంలో పరిమితులెన్నో...

  • క్లిష్టత స్థాయితో సంబంధం లేకుండా ఒకే సంఖ్యలో ప్రశ్నలు ఇవ్వడం, పరీక్ష వ్యవధిని అందరికీ ఒకేలా వర్తింపజేయడం అన్యాయమనే వాదన ఉంది.

  • విద్యార్థులకు వచ్చిన పర్సంటైల్‌ను కాకుండా మొత్తం మార్కులను పరిగణనలోకి తీసుకోవడం కూడా స్ట్రీమ్‌ మారాలని భావించే సైన్స్‌ విద్యార్థులకు ప్రతికూలంగా మారుతోంది.

  • రాష్ట్ర బోర్టులు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కంటే సీబీఎ్‌సఈ విద్యార్థులు ముందంజలో ఉంటారు. ఈ నేపథ్యంలో సమాన అవకాశాల కోసం ‘ఒకే దేశం ఒకే సిలబస్‌’ను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • సీయూఈటీ-యూజీ పరీక్షను దాదాపు నెల రోజుల పాటు, వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నార్మలైజేషన్‌ ప్రక్రియ అసంబద్ధంగా మారిందని, ఇది చాలావరకూ దుర్వినియోగమవుతోందని ఆరోపణలొస్తున్నాయి.

Updated Date - Jul 06 , 2025 | 03:21 AM