Vice President election: ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ చిచ్చు
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:27 AM
ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడి రెండురోజులు అయినప్పటికీ.. ఆ ఎన్నికల్లో ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారన్న అనుమానాలు కూటమిలో చిచ్చు రేపుతున్నాయి...
ఆప్‌తోపాటు కొన్ని పార్టీల ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశారు
20 కోట్ల చొప్పున ఆఫర్: అభిషేక్ బెనర్జీ
మావైపు నుంచి జరగలేదు: తేజస్వీ యాదవ్
మహారాష్ట్రను బద్నాం చేసే కుట్ర: సుప్రియాసూలే
క్రాస్ ఓటింగ్‌పై దర్యాప్తు చేయాలి: మనీశ్ తివారీ
సోనియాతో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి భేటీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడి రెండురోజులు అయినప్పటికీ.. ఆ ఎన్నికల్లో ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారన్న అనుమానాలు కూటమిలో చిచ్చు రేపుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో సహా కొన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఆప్‌లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఒక మహిళా ఎంపీతోపాటు కనీసం నలుగురు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఇవ్వజూపారన్నారు. తమ పార్టీ మీద వస్తున్న ఆరోపణల మీద ఆప్ ఎంపీ సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. ఏ ఎంపీ ఎవరికి ఓటు వేశారన్న విషయం ఎన్నికల సంఘానికే తెలుస్తుందని, ఎవరు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో కమిషనే బయట పెట్టాలన్నారు. ఆప్‌తోపాటు శివసేన, ఆర్జేడీకి చెందిన కొందరు ఎంపీలపైనా ఇండియా కూటమిలో అనుమానాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ తీవ్రమైన అంశమని, ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో తేల్చేందుకు దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేయటం గమనార్హం. తమవైపు నుంచి ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరగలేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 15 ఓట్లు చెల్లకపోవడంపై శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ విస్మయం వ్యక్తం చేశారు. స్వయంగా ఎంపీలు చెల్లని ఓట్లు వే యటం ఏమిటని, వాళ్లు అసలు చదువుకున్న వారే నా? అని ఆయన ప్రశ్నించారు. క్రాస్‌ఓటింగ్ వివాదంపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ.. అనవసరంగా తమ రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారన్నారు. కాగా, విపక్ష కూటమిలోని ఈ లుకలుకలపై అధికార ఎన్డీఏ వ్యంగ్యబాణాలు విసురుతోంది. ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలు తమ అంతరాత్మ ప్రబోధానుసారం సీపీ రాధాకృష్ణన్‌కు అనుకూలంగా ఓటు వేశారని, వారికి కృతజ్ఞతలు అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
సోనియాతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో సోనియాతో స మావేశం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, సామాజిక ఉద్రిక్తతలపై సోనియాగాంధీతో చర్చించినట్టు తెలిపారు. ఇండియా కూటమికి చెందిన మొత్తం ఓట్లు ఎందుకు పడలేదని ఆమె మథనపడ్డారన్నారు. క్రాస్ ఓటింగ్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, అయితే, 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి అభినందన లు తెలిపానని తెలిపారు. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి, పదవుల కోసం పాకులాడే అవసరం తనకు లేదన్నారు. లోహియా, కాళోజీ, గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి ఎంతో మంది మహనీయులు స్ఫూర్తిగా, రాజ్యాంగంలోని ఆదేశికసూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
For More TG News And Telugu News