Share News

Ghaziabad: దారుణం.. అద్దె అడిగినందుకు చంపి.. సూట్‌కేసులో కుక్కి..

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:33 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి క్షణికావేశానికి గురై ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంటి అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఓనర్‌ని అతి దారుణంగా చంపేశారు.

Ghaziabad: దారుణం.. అద్దె అడిగినందుకు చంపి.. సూట్‌కేసులో కుక్కి..
Ghaziabad Crime News

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఘజియాబాద్‌(Ghaziabad)లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కొంత కాలంగా బకాయీ పడ్డ ఇంటి అద్దె(House rent)అడిగిన పాపానికి ఓనర్ హత్యకు గురైంది. ఉమేష్ శర్మ, దీప్‌శిఖా శర్మ (48) దంపతులు. రాజ్‌నగర్ (Rajnagar)ఎక్స్‌టెన్షన్‌లోని హౌసింగ్ సొసైటీలో వీరికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఒక ఫ్లాట్‌లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. మరో ఫ్లాట్ అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా దంపతులకు రెంట్‌కి ఇచ్చారు. అజయ్ గుప్తా ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ (Transport Business)చేస్తున్నాడు. గుప్తా దంపతులు గత నాలుగు నెలల నుంచి ఫ్లాట్ రెంట్ కట్టకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓనర్ దీప్‌శిఖా శర్మ అద్దె వసూలు చేసేందుకు అజయ్ గుప్తా ఫ్లాట్‌కి వచ్చింది. ఎంత సేపటికీ దీప్‌శిఖా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఉమేష్ ఆనుమానం వచ్చింది.


ఇంటి పనిమనిషి మీనాకు చెప్పి తెలిసిన వాళ్ల వద్ద వాకబు చేయించాడు. ఎక్కడ కూడా దీప్‌శిఖా జాడ లభించలేదు. అజయ్ గుప్తా ఇంటికి అద్దె వసూలు చేసేందుకు వెళ్లినట్లు తెలియడంతో అక్కడికి వెళ్లారు. దీప్‌శిఖా మీ ఇంటికి వచ్చిందా అన్న ప్రశ్నకు భార్యాభర్తలు చెప్పిన సమాధానంలో తేడా రావడంతో మీనాకు అనుమానం వచ్చింది. అంతేకాదు సీసీటీవీ ఫుటేజ్ చూడగా దీప్‌శిఖా వాళ్ల ఇంట్లోకి వెళ్లినట్లు కనిపించింది. కానీ మళ్లీ బయటకు మాత్రం రాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది మీనా. పోలీసులు వస్తారన్న భయంతో గుప్తా దంపతులు పారిపోయేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వాళ్లు పట్టుకున్నారు.


పోలీసులు వచ్చి గుప్తా ఇంట్లో సోదా చేయగా మంచం కింద దాచి ఉంచిన సూట్‌కేస్ లో దీప్‌శిఖా మృతదేహం లభించింది. ఈ క్రమంలోనే పోలీసులు తమదైన స్టైల్లో గుప్తా దంపతులను ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నారు. దీప్‌శిఖా ఇంటికి వచ్చి రెంట్ గురించి తమను ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో ఆవేశం తట్టుకోలేక కుక్కర్‌తో తలపై కొట్టి చంపినట్లు తెలిపారు. సూట్‌కేస్ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆ తర్వాత గుప్తా దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అద్దె చెల్లించమని అడిగినందుకు ఓనర్‌ని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.


ఇవి కూడా చదవండిః

మెస్సి కోల్‌కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!

కాంగ్రెస్‏లో‏ అంతర్మథనం.. రంగారెడ్డి శివార్లలో గట్టిపోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌

Updated Date - Dec 19 , 2025 | 12:07 PM