Share News

India Counter Plans: ట్రంప్‌ టారిఫ్‌లకు కౌంటర్‌.. 40 దేశాల్లో భారత్ స్పెషల్ ప్రోగ్రామ్స్

ABN , Publish Date - Aug 28 , 2025 | 03:46 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ భారత్ కౌంటర్ ప్రణాళికలు రూపొందిస్తోంది. తక్షణం ప్రభావితమయ్యే రంగాలను రక్షించుకునేందుకు..

India Counter Plans: ట్రంప్‌ టారిఫ్‌లకు కౌంటర్‌.. 40 దేశాల్లో భారత్ స్పెషల్ ప్రోగ్రామ్స్
India Counter Plans

న్యూఢిల్లీ, ఆగస్టు 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన వేళ భారత్ కౌంటర్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ అదనపు టారిఫ్‌లు, జరిమానాలతో తక్షణం ప్రభావితమయ్యే రంగాలను రక్షించుకునేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. మన జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు నిర్వహించబోతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్, రష్యా, బెల్జియం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, పోలండ్‌, కెనడా, మెక్సికో తదితర దేశాల్లో భారత్ ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించబోతోంది.


ఆయా దేశాల్లో మన ఉత్పత్తులకు మార్కెట్‌ను మరింత విస్తరించేలా ఈ ప్రోగ్రామ్‌లు ఉండనున్నాయి. మన వస్తువుల నాణ్యత, సుస్థిరత గురించి ఆయా దేశాలకు చాటిచెప్పేలా ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. సరికొత్త టెక్స్‌టైల్‌ ఉత్పత్తులతో ఆయా మార్కెట్లలో మన దేశం ప్రధాన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ కార్యాచరణ ప్రతిపాదించారు. ప్రస్తుతం భారత్‌ 220 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇందులో ఈ ప్రతిపాదిత 40 దేశాలు కీలకమైనవి. ఈ దేశాలన్నీ కలిపి ఏటా 590 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన టెక్స్‌టైల్‌ ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.


ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో మార్కెట్‌ షేర్‌ పెంచుకుంటే అది మన పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కల్పించనుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్‌ మ్యాపింగ్‌, డిమాండ్‌ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను గుర్తించడం, సూరత్‌, పానిపట్‌, తిరుపూర్‌, బదోహి వంటి ప్రాంతాల్లో పేరొందిన స్వదేశీ ఉత్పత్తులకు ఈ 40 దేశాల్లో ప్రచారం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇప్పుడు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

ఈ క్రమంలో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, అమ్మకం-కొనుగోలుదారులతో సమావేశాలు, యునిఫైడ్‌ బ్రాండ్‌ ఇండియా విజన్‌ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతోంది భారత్. తద్వారా భారత వాణిజ్య రంగాన్ని రక్షించుకోవాలని చూస్తోంది.


ఇవి కూడా చదవండి:

ట్రంప్ చేతిపై మళ్లీ ఎర్రని మచ్చ.. అసలేం జరుగుతోంది

తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త.. ప్రపంచదేశాలకు ట్రంప్ హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 04:19 PM