Share News

Supreme Court: హైకోర్టుల్లో ఏం జరుగుతోంది

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:38 AM

సివిల్‌ వివాదాన్ని క్రిమినల్‌ కేసుగా పరిగణించి విచారణకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌..

Supreme Court: హైకోర్టుల్లో ఏం జరుగుతోంది

  • సివిల్‌ కేసులో క్రిమినల్‌ ప్రొసీడింగ్సా.. ఎలా సాధ్యం?

  • ఈ తరహా తీర్పులు బయటి ఒత్తిళ్ల వల్ల వస్తున్నాయా? లేక అవగాహనలేమితోనా? అని ఆశ్చర్యం వేస్తుంటుంది

  • అలహాబాద్‌ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • ఆయన తన తీర్పుతో న్యాయవ్యవస్థను హేళన చేశారని,అది అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటని వ్యాఖ్య

  • పదవీ విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్‌ కేసుల విచారణే అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 6: సివిల్‌ వివాదాన్ని క్రిమినల్‌ కేసుగా పరిగణించి విచారణకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తీర్పును అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటిగా అభివర్ణించింది. ‘‘ఇలాంటి తీర్పులు బయటి ఒత్తిళ్ల కారణంగా వస్తాయా లేక చట్టంపై అవగాహన లేకపోవడం వల్లా? అని మాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. కారణమేదైనాగానీ.. ఇలాంటి అసంబద్ధ, తప్పుడు ఆదేశాలివ్వడం క్షమించదగిన విషయం కాదు’’ అని మండిపడింది. ఈ తరహా తీర్పు ఇవ్వడం ద్వారా ఆ న్యాయమూర్తి తనను తాను తక్కువ చేసుకోవడమే కాక.. న్యాయవ్యవస్థను హేళన చేశారని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘‘హైకోర్టుల స్థాయిలో భారత న్యాయవ్యవస్థకు ఏం జరుగుతోందో మాకు అర్థం కావట్లేదు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదాస్పద తీర్పును ఉపసంహరించి.. ఈ కేసును మరో జడ్జికి కేటాయించాలని, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ను వేరే సీనియర్‌ జడ్జితో కూడిన ధర్మాసనంలో నియోగించాలని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ఆయన పదవీ విరమణ చేసేదాకా ఎలాంటి క్రిమినల్‌ కేసుల విచారణా ఆయనకు అప్పగించొద్దంటూ అత్యంత అసాధారణ ఆదేశాలు జారీచేసింది. ఈ ఒక్క తీర్పే కాక.. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ గతంలో కూడా ఇదే తరహాలో పలుఅసంబద్ధ ఆదేశాలు ఇచ్చినట్టు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్టు జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌తో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లలిత టెక్స్‌టైల్స్‌ అనే కంపెనీ.. శిఖర్‌ కెమికల్స్‌ అనే సంస్థకు రూ.52.34 లక్షల విలువైన నూలు సరఫరా చేసింది.


అయితే, శిఖర్‌ సంస్థ రూ.47.75 లక్షలు మాత్రమే చెల్లించి రూ.4.59 లక్షలు బకాయి పెట్టింది. ఇదంతా 2019లో జరిగింది. అప్పట్నుంచీ వడ్డీతో కలిపి బకాయి రూ.7 లక్షలకు పెరిగింది. బకాయి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా, లీగల్‌ నోటీసులు పంపినా శిఖర్‌ యాజమాన్యం స్పందించకపోవడంతో.. లలిత టెక్స్‌టైల్స్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఇది సివిల్‌ కేసు కావడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. దీంతో ఆయన ‘కోర్ట్‌ ఆఫ్‌ ద అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌’లో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఆ కోర్టు జారీ చేసిన సమన్లను శిఖర్‌ సంస్థ అలహాబాద్‌ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఆ కేసును విచారించిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌.. శిఖర్‌ సంస్థ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ ఏడాది మే5న తీర్పు ఇచ్చారు. సివిల్‌ కేసు అయితే తేలడానికి ఏళ్లు పడుతుందని, ఆ కేసు విచారణ నిమిత్తం లలిత టెక్స్‌టైల్స్‌ యాజమాన్యం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని.. కోల్పోయిన డబ్బును పొందడానికి మరిన్ని డబ్బును ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. కాబట్టి ఈ కేసును సివిల్‌కోర్టుకు పంపితే అది న్యాయాన్ని హేళన చేయడమే అవుతుందని, దానివల్ల లలిత టెక్స్‌టైల్స్‌ యజమానికి పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని తీర్పులో పేర్కొన్నారు. సివిల్‌ దావాల్లో అయ్యే ఖర్చు, ఆలస్యాన్ని నివారించడానికి ఇలాంటి కేసుల్లో క్రిమినల్‌ చర్యలు తీసుకోవడాన్ని సమర్థిస్తూ.. శిఖర్‌ సంస్థ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. సివిల్‌ సమస్యల పరిష్కారానికి క్రిమినల్‌ చట్టాలను ఉపయోగించలేమని స్పష్టం చేస్తూ జస్టిస్‌ ప్రశాంత్‌ ఆదేశాలను కొట్టేసింది. భవిష్యత్తులో ఆయన సింగిల్‌ జడ్జిగా ఆసీనులైనా.. క్రిమినల్‌ కేసులు మాత్రం ఆయనకు కేటాయించొద్దని అలహాబాద్‌ హైకోర్టు సీజేను ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 03:38 AM