Share News

Congress: నేషనల్‌ హెరాల్డ్‌ విరాళాలపై మళ్లీ కలకలం

ABN , Publish Date - May 24 , 2025 | 05:18 AM

కాంగ్రెస్‌ అధికార పత్రిక నేషనల్‌ హెరాల్డ్‌ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలు సేకరించిన వ్యవహారం మరోసారి కలకలం రేపింది.

Congress: నేషనల్‌ హెరాల్డ్‌ విరాళాలపై మళ్లీ కలకలం

పదవుల ఆశ చూపి వసూలు చేశారు

  • ఇది క్విడ్‌ ప్రో కో కిందే వస్తుంది: ఈడీ

న్యూఢిల్లీ, మే 23: కాంగ్రెస్‌ అధికార పత్రిక నేషనల్‌ హెరాల్డ్‌ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలు సేకరించిన వ్యవహారం మరోసారి కలకలం రేపింది. రేవంత్‌రెడ్డి, అహ్మద్‌ పటేల్‌, పవన్‌ బన్సల్‌ లాంటి ముఖ్యమైన నేతలు పార్టీ టికెట్లు, పదవులిస్తామని ఆశ చూపి కాంగ్రెస్‌ నేతల దగ్గర నుంచి విరాళాలు సేకరించారని, ఇది క్విడ్‌ ప్రో కో కిందకు వస్తుందంటూ గత నెల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు తాజాగా వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం రాజుకుంది. నిజానికి 2022లోనే తెలంగాణకు చెందిన పలువురు నేతలను ఈడీ విరాళాల వ్యవహారంలో ప్రశ్నించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన చార్జిషీటులో రేవంత్‌రెడ్డి సూచన మేరకే రాష్ట్ర నాయకులు రూ.80 లక్షలు విరాళంగా ఇచ్చారని పేర్కొంది. బయటి వ్యక్తులను కూడా విరాళాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారని తెలిపింది. డీకే శివకుమార్‌ స్వయంగా రూ.25 లక్షలు విరాళమిచ్చారని, ఆయనకు సంబంధించిన ట్రస్ట్‌ నుంచి రూ.2 కోట్లు ఇప్పించారని పేర్కొంది. యంగ్‌ ఇండియా కార్యకలాపాలేమిటో తనకు తెలియదని, పార్టీ కోశాధికారి పవన్‌ బన్సల్‌ కోరితే విరాళమిచ్చానని శివకుమార్‌ చెప్పారని వెల్లడించింది.


ఈ కేసులో ఈడీ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ప్రధాన నిందితులుగా పేర్కొంది. అభియోగ పత్రాల్లో రేవంత్‌రెడ్డి, పవన్‌ బన్సల్‌, అహ్మద్‌ పటేల్‌ల పేర్లను ప్రస్తావించినా వారిని నిందితులుగా పేర్కొనలేదు. ఈ కేసు విచారణ బుధవారం రౌస్‌ ఎవెన్యూ కోర్టులో జరగడంతో చార్జిషీటు వెలుగులోకి వచ్చింది. ఈడీ అభియోగపత్రం ప్రతీకార రాజకీయాల్లో భాగమని కాంగ్రెస్‌ పేర్కొంది. ముగ్గురు నేతల మనసు కష్టపెట్టడం పార్టీలో తమ భవిష్యత్తుకు నష్టం చేస్తుందనే అభిప్రాయాన్ని విరాళాలు ఇచ్చిన నేతలు చెప్పినట్లు ఈడీ తెలిపింది. యంగ్‌ ఇండియాకు కాంగ్రెస్‌ నేతలు, ఇతరులు ఇచ్చిన సొమ్మును విరాళాలుగా పరిగణించరాదని, అవి స్వచ్ఛందంగా ఇచ్చినవి కాదని, రాజకీయంగా ప్రయోజనాన్ని ఆశించి ఇచ్చినవని ఈడీ అభియోగ పత్రంలో పేర్కొంది. విరాళాలను కాంగ్రెస్‌ పార్టీ ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సిన పన్ను బకాయిలపై అప్పీలుకు డిపాజిట్‌గా వాడిందని పేర్కొంది. విరాళాలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ నేతలతో పంచుకున్నది దివంగత నేత ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ అని ఈడీ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 24 , 2025 | 05:18 AM