Share News

Congress Launches Campaign: ఓటు చోరీపై ఉద్యమం షురూ

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:50 AM

కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీపై రాహుల్‌ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్‌

Congress Launches Campaign: ఓటు చోరీపై ఉద్యమం షురూ
Rahul Gandhi

  • ప్రచారానికి వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్‌.. అందులో రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రజలకు పిలుపు

  • డిజిటల్‌ ఓటర్ల జాబితాకు మద్దతివ్వాలని అభ్యర్థన.. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం: రాహుల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 10: కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీపై రాహుల్‌ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందు కోసం ఒక వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. ‘ఓట్‌ చోరీ’కి వ్యతిరేకంగా, ఈసీ నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసేందుకు votechori.in అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. 9650003420 అనే నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చే లింకులో కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చని పేర్కొంది.


డిజిటల్‌ ఓటర్ల జాబితాను కోరుతున్న ప్రతిపక్ష నేత రాహుల్‌కు మద్దతు తెలపాలని కోరింది. ఓట్ల చోరీ అనేది ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపైదాడి అని రాహుల్‌ ఆదివారం ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అవకతవకలు లేని ఓటర్ల జాబితా అవసరమని నొక్కిచెప్పారు. ‘మేం ఎన్నికల సంఘాన్ని ఒక్కడే డిమాండ్‌ చేస్తున్నాం.. పారదర్శకంగా వ్యవహరించి, డిజిటల్‌ ఓటర్ల జాబితాలో ప్రజలకు అందుబాటులో ఉంచండి. తద్వారా ప్రజలు, రాజకీయ పార్టీలు స్వీయ ఆడిట్‌ చేసుకుంటారు’ అని పేర్కొన్నారు. వెబ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా ఈ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరారు.


‘ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటం’ అని కాంగ్రెస్‌ నేత చెప్పారు. కాంగ్రెస్‌ ప్రారంభించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే.. ఓట్ల చోరీ రుజువులు, ఈసీ నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేయడం, ఓట్‌ చోరీని రిపోర్ట్‌ చేయడం అనే అంశాలు కనిపిస్తాయి. వీటితో పాటు ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ, ఈసీ కుమ్మక్కై ఎన్నికల మోసానికి పాల్పడ్డాయన్న రాహుల్‌ ఆరోపణల వీడియో ఉంది.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల విభాగం (డీఎ్‌ఫఏ) చైర్మన్‌గా ఉన్న సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ ఆదివారం రాజీనామా చేశారు. విభాగం పునర్నిర్మాణంలో సహకరించేందుకు, అందులోకి యువ నేతలను తీసుకొచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆనంద్‌ శర్మ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 11 , 2025 | 08:43 AM