CM Stalin: కేంద్రమా.. ఇది న్యాయమా..
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:17 AM
కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించేదిశగా ఎన్నో కమిటీలు ఏర్పాటైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించివేయడమే పనిగా పెట్టుకుందని, జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టడం భావ్యమేనా అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.
చెన్నై: కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించేదిశగా ఎన్నో కమిటీలు ఏర్పాటైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించివేయడమే పనిగా పెట్టుకుందని, జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టడం భావ్యమేనా అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) మండిపడ్డారు. కొత్త చట్టాలు తీసుకొచ్చి, రాష్ట్రాల హక్కులన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తోందని ఆరోపించారు.
చేపాక్‌లోని కలైవానర్ అరంగంలో కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించకూడదనే స్ఫూర్తితో 50 యేళ్ళలో సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటనలను అధ్యయనం చేసి, అవసరమైన రాజ్యంగ సవరణలు చేయడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించే దిశగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. 1983లో కర్ణాటకలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత అప్పటి కేంద్రం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్కారియా నేతృత్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిషన్ రాష్ట్రాలకు మరిన్ని అధికారులు కల్పించేలా తగని సిఫారసులు చేయలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఏర్పాటైన జస్టిస్ పుంచీ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించే వారినే గవర్నర్లుగా నియమించాలని సిఫారసు చేసిందని, ఇలా వరుసగా కమిటీలు చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోకపోగా కేంద్రం కొత్త చట్టాలు తీసుకువచ్చి రాష్ట్రాల హక్కులను హరించి వేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. ద్రవిడ ఉద్యమనేతలు పిట్టి త్యాగరాయర్, డాక్టర్ నటేశన్, డాక్టర్ టీఎం నాయర్ ఉద్యమాల ద్వారా రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని ఏర్పాటు చేశారని, వందేళ్లుగా రాష్ట్రంలో రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ద్రావిడ సిద్ధాంతాల రూపకర్తలైన పెరియార్, అన్నాదురై, కరుణానిధి కూడా సమానత్వం, మహిళా హక్కుల సాధనకోసమే పోరాడారని చెప్పారు.
సర్వహక్కులను హస్తగతం చేసుకున్న కేంద్రం రక్తపీడనంతో ఉండగా, రాష్ట్రాలు రక్తహీనతతో బాధపడుతున్నాయని అభివర్ణించడం సమంజసంగా ఉంటుందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నామని, ఆర్థికపరంగా పురోభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలపై ఇతర రాష్ట్రాలు దృష్టిసారిస్తున్నాయని, రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలన్నదే తమ ఆశయమన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ద్రావిడ తరహా సుపరిపాలన అందిస్తున్నామన్నారు.

ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్, సభ్యులు అశోక్ వర్థన్ శెట్టి, డాక్టర్ నాగనాధన్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మంత్రులు తంగం తెన్నరసు, ఆర్‌ఎస్ రాజకన్నప్పన్, పీకే శేఖర్‌బాబు, కోవి చెళియన్, కేరళ మాజీ మంత్రి థామస్ ఐజాక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు..
Read Latest Telangana News and National News