Share News

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌పై చైనా రియాక్షన్.. సంయమనం పాటించాలంటూ..

ABN , Publish Date - May 07 , 2025 | 10:01 AM

జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్‌సపై చైనా స్పందించింది.

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌పై చైనా రియాక్షన్.. సంయమనం పాటించాలంటూ..

జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్‌సపై చైనా స్పందించింది. భారత్‌, పాక్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రెండు దేశాలూ సంయమనం పాటించాలని కోరింది.


పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన చైనా (China) భారత్‌తోనూ సరిహద్దులు పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం వేకువజామున భారత ఆర్మీ (Indian Army) చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై (Operation Sindhur) చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. భారత్, పాకిస్తాన్ రెండూ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సంయమనం పాటించాలని సూచించారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఏప్రిల్ 27న చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్‌యికి ఫోన్ చేసి వివరాలు అందించారు. పాకిస్తాన్‌లోని చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీలను కలిశారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రపంచం యొక్క ఉమ్మడి బాధ్యత అని చెప్పారు. ఈ వివాదం భారత్, పాక్ ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడకపోవడంతో పాటూ ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి దోహదపడదన్నారు. దీంతో వీలైనంత త్వరగా నిష్పాక్షిక దర్యాప్తునకు చైనా మద్దతు ఇస్తోందన్నారు. పాకిస్తాన్‌కు సంబంధించిన చట్టబద్ధమైన భద్రతా సమస్యలను చైనా పూర్తిగా అర్థం చేసుకుంటుందన్నారు. అలాగే పాకిస్తాన్ సార్వభౌమత్వం, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడంలో తమ మద్దతు ఉంటుందంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్‌ సింధూర్‌పై భారత ఆర్మీ వీడియో విడుదల చేసింది. చెప్పిందే చేశాం.. అని ప్రస్తావిస్తూ వీడియోను షేర్ చేసింది.

Updated Date - May 07 , 2025 | 10:47 AM