Share News

Pregnancy Robot: రోబోకు అమ్మతనం!

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:47 AM

రజనీకాంత్‌ నటించిన రోబో సినిమా గుర్తుందా ? సనా(ఐశ్వర్యరాయ్‌)ను పెళ్లిపీటల మీద నుంచి ఎత్తుకొచ్చిన చిట్టి(రోబో).. తాను అభివృద్ధి చేసిన కృత్రిమ జీవకణాన్ని సనా గర్భంలో ప్రవేశపెడతానంటాడు.

Pregnancy Robot: రోబోకు అమ్మతనం!

  • బిడ్డను గర్భంలో మోసి జన్మనిచ్చే హ్యుమనాయిడ్‌ రోబోలను అభివృద్ధి చేస్తున్న చైనా

హైదరాబాద్‌, ఆగస్టు 16: రజనీకాంత్‌ నటించిన రోబో సినిమా గుర్తుందా ? సనా(ఐశ్వర్యరాయ్‌)ను పెళ్లిపీటల మీద నుంచి ఎత్తుకొచ్చిన చిట్టి(రోబో).. తాను అభివృద్ధి చేసిన కృత్రిమ జీవకణాన్ని సనా గర్భంలో ప్రవేశపెడతానంటాడు. మనిషికి, యంత్రానికి పుట్టిన తొలి బిడ్డకు జన్మనిద్దామని సనాకు చెబుతాడు. ఇన్నాళ్లూ సినిమాకే పరిమితమైన ఈ మాటలను కృత్రిమ మేధ(ఏఐ) నిజం చేయబోతుంది. అవును.. మనిషికి రోబోకు పుట్టిన సంతానాన్ని చూసే రోజులు రాబోతున్నాయి. చిట్టి చెప్పినట్టు కాదు కానీ.. గర్భం దాల్చి నవ మాసాలు బిడ్డను మోసి జన్మనిచ్చే హ్యుమనాయిడ్‌ రోబోలను చైనా శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. రోబోలకు అమ్మతనాన్ని ఇచ్చేలా సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నాలజికల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ జాంగ్‌ కీఫెంగ్‌ నేతృత్వంలోని బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘ప్రెగ్నెన్సీ రోబో’ను అభివృద్ధి చేస్తోంది. చైనా మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంక్యుబేటర్లకు ప్రెగ్నెన్సీ రోబోలకు ఏమాత్రం సంబంధం లేదు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కృత్రిమంగా అభివృద్ధి చేసిన గర్భసంచి ఈ ప్రెగ్నెన్సీ రోబోల్లో ఉంటుంది.


ఆర్టిఫిషియల్‌ అమ్నియోటిక్‌ ద్రవాలతో నిండి ఉండే ఈ కృత్రిమ గర్భసంచి అచ్చం మానవ గర్భసంచిలానే పని చేస్తుంది. నిజజీవితంలో గర్భధారణ నుంచి ప్రసవం వరకు జరిగే ప్రక్రియ అంతా ప్రెగ్నెన్సీ రోబో గర్భంలో అలానే జరుగుతుంది. గర్భసంచిలోని శిశువు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను గొట్టాల ద్వారా అందిస్తారు. నిజానికి, ఈ కృత్రిమ గర్భం కొత్త విధానం కాదని డాక్టర్‌ జాంగ్‌ చెప్పారు. బయో బ్యాగ్‌ పేరిట అభివృద్ధి చేసిన కృత్రిమ గర్భసంచి సాయంతో గతంలో కొందరు శాస్త్రవేత్తలు ఓ గొర్రె పిల్ల పుట్టేలా చేశారని వివరించారు. ఆ గొర్రెల పిల్ల జీవించడమే కాక దానికి ఉన్ని కూడా పెరిగిందని చెప్పారు. ఈ బయో బ్యాగ్‌ సాంకేతికతను మరింత మెరుగుపరుస్తూ ప్రెగ్నెన్సీ రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ రోబోల ప్రోటోటైప్‌ వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని, ఇందుకు రూ.12.96 లక్షల వరకు వ్యయం అవుతుందని జాంగ్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:48 AM