Cough Syrup Incident: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..
ABN , Publish Date - Oct 03 , 2025 | 12:25 PM
ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్‌కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు.
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరఫరా చేస్తున్న దగ్గు మందు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దగ్గు మందు తాగిన చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, భరత్‌పూర్ జిల్లాలో రెండేళ్ల ఓ బాలుడు దగ్గు మందు తాగిన తర్వాత అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆ దగ్గు మందు తాగటం వల్లే తమ కుమారుడు చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
లుహాసా గ్రామానికి చెందిన నిషాల్ సింగ్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఐదేళ్ల థాన్ సింగ్, రెండేళ్ల తీర్థరాజ్ సెప్టెంబర్ 23వ తేదీన అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు విపరీతంగా ఉండటంతో తల్లిదండ్రులు వారిని వైరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. డాక్టర్ బబ్లూ ముద్గల్ వారికి దగ్గు మందుతో పాటు మరికొన్ని మందులు రాసిచ్చాడు. నిషాల్ దంపతులు ఆస్పత్రిలోనే ఫ్రీగా మందుల్ని తీసుకుని ఇంటికి వచ్చారు.
ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్‌కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు. తర్వాత అతడి పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు అతడ్ని వైరా సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడి పరిస్థితి బాగోలేకపోవటంతో భరత్‌పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. భరత్‌పూర్ ఆస్పత్రికి తీసుకువెళ్లినా పిల్లాడి ఆరోగ్యం మెరుగుపడలేదు. సెప్టెంబర్ 27వ తేదీన చనిపోయాడు. దగ్గు మందు కారణంగానే తమ కుమారుడు చనిపోయాడంటూ బాలుడి తల్లిదండ్రులు నిరసనలకు దిగారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, మీడియా కథనాల నేపథ్యంలో దగ్గు మందు సరఫరా ఆగిపోయింది. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు..