Chennai News: మెరీనాలో బైక్ రేస్ నిషేధం..
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:08 AM
చెన్నై నగరంలోగల మెరీనా బీచ్ ప్రాంతంలో బైక్ రేస్‌లను నిషేధించారు. ఈమేరకు గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎలియట్స్ బీచ్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 7 నుంచి జవనరి 1వ తేది ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులుంటాయని పోలీస్ శాఖ తెలిపింది.
- న్యూ ఇయర్ వేడుకలకు పటిష్ఠ భద్రత
చెన్నై: నూతన సంవత్సర వేడుకలకు రాజధాని నగరం ప్రత్యేక హంగులతో ముస్తాబవుతోంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు 2026వ సంవత్సరాన్ని ఘనంగా నగరవాసులు ఆహ్వానించనున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 19వేల మంది పోలీసులతో భద్రత కల్పించనున్నట్లు గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్ పేర్కొన్నారు. ఇదిలా వుండగా, మెరీనా బీచ్ సమీపంలోని కామరాజర్ రోడ్డు, ఎలియట్స్ బీచ్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 7 నుంచి జవనరి 1వ తేది ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులుంటాయని ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు. సాయుధదళం, తమిళనాడు స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల్లోని సుమారు 19వేల మంది పోలీసులతో 1500 మంది హోంగార్డులు న్యూఇయర్ వేడుకల భద్రతా విధుల్లో పాల్గొంటారు.
కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి బైకులు వేగంగా నడపడం, బైక్ రేసులు నిర్వహించడం వంటివాటిపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. బైక్ రేసులను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు నగరంలోని 30ఫ్లైఓవర్‌లను బుధవారం రాత్రి నుండి మూసివేస్తారు. కాగా, నగరంలో వంద కు పైగా ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు కమిషనర్ అరుణ్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేస్తారు.

సముద్రంలో స్నానాలు నిషేధం
మెరీనా, శాంథోం, పట్టినంబాక్కం, ఎలియట్స్, నీలాంగరై తదితర బీచ్ ప్రాంతాల్లో రద్దీని నియంత్రించేందుకు బారిగేట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ప్రజల కదలికలను పర్యవేక్షించనున్నారు. మరోవైపు తాత్కాలిక పోలీసు సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సముద్రంలో స్నానాలు నిషేధించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యల కింద గజ ఈతగాళ్లు, ఆంబులెన్స్ వాహనాలను సిద్ధం చేశారు. రాజథాని నగరంలో పలు ప్రాంతాల్లో నేటి అర్థరాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ ట్రాఫిక్ మార్పులు చేశారు.
శాంథోం ఫోర్‌షోర్ సర్వీస్ రోడ్డును బుధవారం సాయంత్రం 7 నుంచి జనవరి 1వ తేది ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు. కామరాజర్ రోడ్డు ఈ నెల 31వ తేది రాత్రి 8 నుంచి జనవరి 1వ తేది ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. అదే విధంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ మల్లించనున్నారు. తిరువాన్మియూర్ నుండి ప్రారంభమయ్యే ఈస్ట్‌కోస్ట్ రోడ్డు (ఈసీఆర్)లో ఉన్న ఇళ్లు, బీచ్ రిసార్ట్‌లలో న్యూఇయర్ వేడుకలకు కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లపై చెంగల్పట్టు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ సాయి ప్రణీత్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News