Chennai News: కన్నీటి ‘సునామీ’కి 21 యేళ్లు..
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:35 PM
సునామీ వచ్చి 21 సంవత్సరాలు పూర్తయింది. ఆ పెను విషాదాన్ని తీరం వాసులు ఇప్పటికీ మరువలేకనొతున్నారు. సునామీ జలప్రళయం వచ్చి 21 ఏళ్లు గడిచిన సందర్భంగా శుక్రవారం తమ వారికి తీరం వెంబడి కన్నీటితో అంజలి ఘటించారు. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంట నివాళుర్పించారు.
- సాగర తీరంలో పూజలు
- సముద్రం ఒడ్డున మృతులకు నివాళులు
చెన్నై: సునామీ విలయం సృష్టించిన విషాదం మరువలేక, కనిపించకుండాపోయిన తమ వారి జాడ తెలియక అల్లాడిపోతున్న కుటుంబాలు.. తమ వారికి నివాళులర్పించాయి. సునామీ జలప్రళయం వచ్చి 21 ఏళ్లు గడిచిన సందర్భంగా శుక్రవారం తమ వారికి తీరం వెంబడి కన్నీటితో అంజలి ఘటించారు. నగరంలో సునామీ మృతులకు నివాళులర్పించేందుకు వారి కుటుంబీకులు శుక్రవారం ఉదయం మెరీనాబీచ్‌కు చేరుకున్నారు. శాంతంగా వుండాలని, ప్రళయాన్ని సృష్టించవద్దంటూ సముద్రంలో పాలు పోసి పూజలు చేశారు.

ఇదే విధంగా నాగపట్టినం, కడలూరు, కన్నియాకుమారి తదితర తీర ప్రాంతాల్లో సముద్రంలో పాలుపోసి, పూలు వేసి మౌన ర్యాలీలు నిర్వహించి, సునామీ మృతుల స్మారక చిహ్నాలు, స్తూపాల వద్ద దీపాలు వెలిగించి మృతుల ఆత్మకు శాంతికి ప్రార్థించారు. నాగపట్టినం జిల్లా వేలాంకన్ని ప్రాంతంలోని సునామీ మృతుల స్మారక స్థూపంలో క్రైస్తవ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాజధాని నగరం చెన్నై నుంచి కన్నియాకుమారి వరకు సముద్రతీర ప్రాంతాల్లో సునామీ మృతుల ఫొటోలతో కూడిన బ్యానర్లు ఏర్పాటుచేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
2004 డిసెంబరు 26న ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం సమీపంలో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా రాష్ట్రంలోని సముద్రతీరమంతటా సునామీ పెను జలవిలయాన్ని సృష్టించింది. ఆ ఉప్పెనతో వేలాదిలాది మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఎన్నూర్ బీచ్ నుంచి పట్టినంబాక్కం కోవలం బీచ్ దాకా 206 మంది, నాగపట్టణంలో 6,065 మంది, కడలూరులో 610 మంది, కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 3,077 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఉప్పెనలో తీరానికి శవాలుగా కొట్టుకొచ్చిన వారు 10 వేలు అయితే, గల్లంతైన వారు మరో 2 వేల మందికి పైగా ఉంటారని అధికారులు సమాచారం. మృతుల ఆత్మలు శాంతించాలంటూ అప్పటి నుంచి ప్రతియేటా సునామీ స్మారక దినాన బాధిత కుటుంబాలు సముద్రానికి పాలు పోసి అంజలి ఘటించారు.. స్థానిక రాయపురం, కాశిమేడు, పట్టినంబాక్కం సహా కన్నియాకుమారి, కడలూరు, వేలాంకన్ని తదితర ప్రాంతాల్లోని సునామీ స్మారకస్థూపాల వద్ద వేలాది మంది నివాళులర్పించారు.
కాశిమేడులో...
కాశిమేడు చేపల రేవు వద్ద అన్నాడీఎంకే ఆధ్వర్యంలో సునామీ మృతులకు నివాళుర్పించారు.. ఆ పార్టీ మాజీ మంత్రి డి. జయకుమార్, రాయపురం మనో పార్టీ ప్రముఖులు ఓ పడవలో వెళ్ళి సముద్రంలో పాలు పోసి నివాళుర్పించారు.
కడలూరులో...
కడలూరు ముత్తునగర్ సింగార్‌తోపు వద్ద సునామీ మృతుల స్మారక స్తూపం వద్ద స్థానిక ప్రజలు నివాళులర్పించారు. ఇదే విధంగా తిరుపాదిరి పులియూరు, మంజల్‌కుప్పం, ముత్తునగర్, కింజంపేట తదితర ప్రాంతాల్లో శుక్రవారం సునామీ మృతులను స్మరించుకునేలా చేపల దుకాణాలను మూసివేశారు.

కన్నియాకుమారిలో...
కన్నియాకుమారి జిల్లాలోనూ సునామీ మృతులకు నివాళి కార్యక్రమాలు జరిగాయి. కన్నియాకుమారి త్రివేణి సంగమ ప్రాంతంలోని సునామీ మృతుల స్మారక స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అళగుమీనా ఇతర అధికారులు, స్థానికులతో కలిసి నివాళులర్పించారు. మణక్కుడి సెయింట్ ఆంటోనియర్ ఆలయంలో సునామీ మృతుల ఆత్మకు శాంతి కలుగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుండి స్థానికులు ర్యాలీ నిర్వహించి 119 మంది సునామీ మృతులను ఖననం చేసిన సిమెట్రీ వద్దకు వెళ్ళి నివాళులర్పించారు. ఇదే విధంగా కొట్టిలిపాడి వద్ద సునామీ స్మారక స్తూపం వద్ద కూడా స్థానికులు పుష్పాంజలి ఘటించారు. సునామీ మృతులకు నివాళులర్పించేలా కన్నియాకుమారి జిల్లాలో జాలర్లందరూ చేపలవేటకు వెళ్లలేదు.
తిరువొత్తియూరులో...
తిరువొత్తియూరు కేవీకే కుప్పం సముద్రతీరంలో డీఎంకే మత్స్యకార విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ శంకర్ నేతృత్వంలో పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు నివాళుర్పించారు. ఇదే విధంగా పట్టినంబాక్కం శ్రీనివాసపురం బీచ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సునామీ మృతులకు నివాళి కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలు, సినీనటి ఖుష్బూ, కార్యదర్శి కరాటే ఆర్ త్యాగరాజన్ తదితరులు సముద్రంలో పాలు పోసి నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News