Share News

PM Modi: ఆ అధికారం కోర్టులకు లేదు

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:36 AM

రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభల్లో ఆమోదించి, పంపే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

PM Modi: ఆ అధికారం కోర్టులకు లేదు

  • బిల్లుల్ని ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి,

  • గవర్నర్లకు న్యాయస్థానం గడువు పెట్టలేదు

  • అలా చేస్తే రాజ్యాంగపరమైన గందరగోళం

  • సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పిన కేంద్ర సర్కారు

న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభల్లో ఆమోదించి, పంపే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని.. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన లిఖితపూర్వక వాదనల్లో అభిప్రాయపడింది. రాష్ట్రాల బిల్లులపై ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల విచక్షణాధికారాలకు సంబంధించి.. రాజ్యాంగంలోని 200, 201 అధికరణల్లో ఎలాంటి కాలపరిమితీ లేదని గుర్తుచేసింది. ఈ అధికరణల కింద లభించిన అధికారాలను యాంత్రికంగా అమలు చేయడం సాధ్యం కాదని, వాటిని రాజ్యాంగ బాధ్యతల్లో భాగంగా బావించాలని కేంద్రం తెలిపింది. గవర్నర్లకు, రాష్ట్రపతికి.. ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంలో ఎలాంటి కాలపరిమితీ నిర్దేశించలేదని.. అలా గడువు విధించడం వల్ల రాజ్యాంగ బాధ్యతలను వారు సరిగా నిర్వహించలేరని తెలిపింది. న్యాయ పరమైన ఆదేశాల ద్వారా కాల పరిమితిని నిర్దేశించడం సరైంది కాదని, అందుకు రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు.


కాలపరిమితి అంశం 368 అధికరణ కింద పూర్తిగా పార్లమెంట్‌ అధికార పరిధిలోకి వస్తుందని స్పష్టంగా రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలాంటి గడువూ విధించలేరని ఆయన వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలు, జాతీయ స్థాయిలో ప్రజల అభిప్రాయాలను గవర్నర్లు/రాష్ట్రపతి ప్రతిబింబిస్తారని.. గవర్నర్లు కేవలం కేంద్ర దూతలు కారని పేర్కొన్నారు. 200 అధికరణలో.. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో గవర్నర్ల విధులకు సంబంధించి ఆమోదం, నిలిపివేయడం, పెండింగ్‌లో ఉంచడం, తిరిగి పంపించడం మొదలైన నాలుగు స్పష్టమైన చర్యలను మాత్రమే సూచించారని, ఒక్కో పదానికీ వేర్వేరు అర్థాలు, వేర్వేరు అధికారాలు ఉన్నాయని వివరించారు. గవర్నర్‌ తన విచక్షణ ప్రకారం ఆమోదం తెలపవచ్చునని చెప్పారు. 142 అధికరణ కింద పూర్తి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు అధికారాలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ నిబంధనలు అధిగమించి అది అధికారాలను ఉపయోగించలేదని తుషార్‌ మెహతా లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు.


‘‘రాజ్యాంగంలోని ఒక అంగం విఫలమైందనో, పని చేయట్లేదనో, తప్పు చేసిందనో అనుకున్నా.. ఆ కారణంగా మరో అంగం తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాలను తీసుకోవడం సరికాదు. ప్రజాహితం పేరుతోనో..ఆ వ్యవస్థ సరిగా పనిచేయడంలేదనో.. రాజ్యాంగ సిద్ధాంతాలు అలా చెబుతున్నాయనో.. మరో అంగం తనకు లేని హక్కులను దఖలుపరచుకోవడానికి అనుమతించకూడదు. అలా అనుమతిస్తే రాజ్యాంగ నిర్మాతలు సైతం ఊహించని రాజ్యాంగ అస్తవ్యస్తతకు దారితీస్తుంది’’ అని తేల్చిచెప్పారు. బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్‌, రాష్ట్రపతి విచక్షణాధికారాలపై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్న నేపథ్యంలో కేంద్రం తన అభిప్రాయాన్ని నిష్పష్టంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే, రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలపై న్యాయపరమైన అభిప్రాయాన్ని కోరిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:36 AM